
యూరియా కోసం రైతుల ఆందోళన
పరకాల: యూరియా కోసం రైతులు ఆందోళన బాటపట్టారు. పరకాల వ్యవసాయ మార్కెట్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సోమవారం మాదారం పీఏసీఎస్‌కు యూరియా వచ్చిందన్న సమాచారంతో పరకాల, నడికూడ మండలాలకు చెందిన 14గ్రామాల నుంచి వందలాది మంది రైతులు తెల్లవారుజాము నుంచే మార్కెట్ వద్దకు చేరుకున్నారు. దీంతో రైతువేదిక వద్ద చంటిపిల్లలతో చేరుకున్న మహిళ రైతులు నానా అవస్థలు పడ్డారు. దిగుమతి అయిన 440బస్తాల యూరియాను అధికారులు పంపిణీ చేయడంతో మిగతా రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురై రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని రైతులకు నచ్చజెప్పి మరో 100మంది రైతులకు టోకెన్లు ఇప్పించారు. వారంతా నడికూడ మండల కేంద్రంలోని ఆగ్రోస్ ద్వారా తీసుకోవాలని సూచించారు.
యూరియా కోసం క్యూలో చెప్పులు
కమలాపూర్ : మండలంలోని మర్రిపల్లిగూడెం, శనిగరం పీఏసీఎస్‌తో పాటు ఇఫ్కో కేంద్రానికి సోమవారం యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు తెల్లవారుజామున 3 గంటల నుంచే బారులుదీరారు. గంటల తరబడి నిల్చోలేక రైతులు తమ చెప్పులు క్యూలో పెట్టారు. అయినా రైతులందరికి యూరియా దొరక్కపోవడంతో అన్నదాతలు నిరాశతో వెనుదిరిగారు. పనులన్నీ వదులుకుని గంటల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోందన్నారు.

యూరియా కోసం రైతుల ఆందోళన