
కొమ్మాల ఆలయ అభివృద్ధికి ప్రణాళిక
గీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అబివృద్ధికి బృహత్తర ప్రణాళికను రూపొందించి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు తెలిపారు. సోమవారం ఆలయ కార్యాలయంలో వంశపారంపర్యఽ ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులుతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రూ. 89 లక్షల నిధులతో ఆలయ మండపం విస్తరణ పనులు, రూ.45 లక్షలతో భక్తుల క్యూలైన్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి అధి కారుల ఆమోదం కోసం పంపామన్నారు. భక్తుల వసతిగృహాలను నాలుగు అంతస్తుల్లో నిర్మిస్తామని, ఒక్కో గది కోసం దాతల నుంచి రూ. 8.50 లక్షల విరాళాలు సేకరిస్తామని వివరించారు. వరంగల్‌లోని శ్రీశ్రీ మెడికల్ హాల్ వారు రూ.3.50 లక్షల సొంత ఖర్చుతో ధ్వజస్తంభం ఏర్పాటుకు ముందుకు వచ్చారని, రూ.1.50 లక్షల ఆలయ నిధులతో స్విహద్వారం వరకు ఆలయంలోని మంత్రోచ్ఛరణలు వినపడేలా మైక్ సిస్టం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో నిత్యఅన్నదానం ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆలయానికి ఇప్పటి వరకు రూ.1.20 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని, ఆలయంలో ప్రేమ వివాహాలను నిలిపివేశామని, పెద్దలు కుదిర్చిన వివాహాలను అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. అర్చకులు కాండూరి రామాచార్యులు, విష్ణు, ఫనీంద్ర, జూనియర్ అసిస్టెంట్ ప్రేం కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు