
పంటలకు ప్రాణం
నర్సంపేట: జిల్లాలో సోమవారం కురిసిన వర్షాలు పంటలకు ప్రాణం పోశాయి. అన్ని పంటలు కలిపి 3.10 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇందులో పత్తి 1.26 లక్షల ఎకరాలు, పదివేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. జూన్ మొదటి వారంలో కురిసిన వర్షంతో రైతులు విత్తనాలు కొని విత్తారు. ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో కొన్ని చోట్ల పంటలు ఎండిపోయాయి. తిరిగి పత్తి విత్తనాలు కొనుగోలు చేసి రెండోసారి నాటగా మొలకెత్తాయి. అన్ని మండలాల్లో సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం పంటలకు చాలా ఉపయోగపడింది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. చెరువుల్లో నీరు చేరుతోంది. నర్సంపేట పట్టణంలోని రహదారులు చెరువులను తలపించాయి.
1.45 లక్షల ఎకరాల్లో వరిసాగు..
జిల్లాలో 1.45 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగవుతుండగా రైతులు నారుమళ్లను సిద్ధం చేసుకున్నారు. మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు సూచి స్తుండడంతో వరి నాట్ల కోసం రైతులు పనులు ప్రారంభించారు. భారీ వర్షాలు కురిస్తే జిల్లాలోని పాకాల, మాదన్నపేట, రంగాయ, కోపాకుల చెరువుల్లోకి నీరు చేరి మత్తడి పడే అవకాశం ఉంది. భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉంది.
జిల్లాలో సోమవారం నమోదైన వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో)
మండలం గ్రామం వర్షపాతం
ఖానాపురం మంగళవారిపేట 88.3
నల్లబెల్లి మేడపల్లి 76.0
నల్లబెల్లి నల్లబెల్లి 69.3
చెన్నారావుపేట చెన్నారావుపేట 59.3
దుగ్గొండి దుగ్గొండి 44.8
నర్సంపేట లక్నెపల్లి 48.3
నెక్కొండ నెక్కొండ 43.0
పర్వతగిరి ఏనుగల్ 36.3
సంగెం సంగెం 32.8
గీసుకొండ గీసుకొండ 24.5
వర్ధన్నపేట వర్ధన్నపేట 23.8
గీసుకొండ గొర్రెకుంట 17.0
పర్వతగిరి కల్లెడ 14.5
రాయపర్తి రాయపర్తి 13.5
సంగెం కాపులకనపర్తి 10.3
వరంగల్ పైడిపల్లి(ఏఆర్‌ఎస్) 8.0
వరంగల్ కాశిబుగ్గ 8.5
నెక్కొండ రెడ్లవాడ 5.5
ఖిలా వరంగల్ ఉర్సు 5.5
జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం
మొక్కజొన్న, పత్తికి ఊపిరి
వరినాట్లకు సన్నద్ధమవుతున్న రైతులు

పంటలకు ప్రాణం