
నాణ్యమైన విద్య అందించాలి
ధర్మసాగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈఓ వాసంతి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని డాక్టర్ అబ్దుల్ కలాం టీచింగ్ లెర్నింగ్ సెంటర్ భవనంలో కాంప్లెక్స్ ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు ధర్మప్రకాశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశాన్ని గురువారం డీఈఓ వాసంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో ధర్మసాగర్ మండలంలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినందున ప్రతీ విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టి నాణ్యమైన విద్య అందించాలన్నారు. ప్రతీ తరగతిలోని పాఠ్యపుస్తకం, వర్క్ బుక్లోని పాఠ్యాంశాలు సిలబస్ వారీగా సరైన అమరికతో పూర్తి చేయాలని తెలిపారు. ఎంఈఓ రామ్ ధన్, సర్వ శిక్ష అభియాన్ జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ మన్మోహన్ హాజరై ఎఫ్‌ఎల్‌ఎన్, బేస్ లైన్ పరీక్షల ఫలితాల్ని సమీక్షించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రంథాలయాలను బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాల విషయ నిపుణులు శ్యాంసుందర్, నరేశ్ తెలిపారు.
ఉపాధ్యాయులు అంకితభావంతో
పని చేయాలి
వేలేరు: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులంతా బాధ్యతగా, అంకితభావంతో పని చేయాలని హనుమకొండ డీఈఓ వాసంతి అన్నారు. గురువారం మండలంలోని పీచర ప్రభుత్వ పాఠశాలలో జరిగిన స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్, ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్, టీచర్స్ డైరీ, గ్రంథాలయ కార్యాచరణ తదితర కార్యక్రమాలపై ఉపాధ్యాయులకు తగిన సూచనలిచ్చారు. కార్యక్రమంలో క్వాలిటీ కో–ఆర్డినేటర్ మన్మోహన్, ఎంఈఓ చంద్రమౌళి, కాంప్లెక్స్ హెచ్‌ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ వాసంతి