బల్దియాలో పింఛన్‌ పొందుతున్న అనర్హులు 3వేల మంది? | - | Sakshi
Sakshi News home page

బల్దియాలో పింఛన్‌ పొందుతున్న అనర్హులు 3వేల మంది?

Jul 22 2025 6:20 AM | Updated on Jul 22 2025 9:23 AM

బల్దియాలో పింఛన్‌ పొందుతున్న అనర్హులు 3వేల మంది?

బల్దియాలో పింఛన్‌ పొందుతున్న అనర్హులు 3వేల మంది?

ఇటీవల తనిఖీల్లో వెలుగులోకి..

బయటికి పొక్కనీయని అధికారులు

సోషల్‌ ఆడిట్‌ లేక ఇష్టారాజ్యం

ఇతోధికంగా సహకరిస్తున్న

క్షేత్రస్థాయి సిబ్బంది

వరంగల్‌ అర్బన్‌: ఆదరణ కోల్పోయిన వారికి అండగా ఉండాలనే ప్రభుత్వ ఆశ యం పక్కదోవ పడుతోంది. ఆసరా పింఛన్లు కొందరు అవినీతి అధికారుల జేబులు నింపడానికి ఆసరాగా మారుతున్నాయి. ఏదైనా కారణంతో లబ్ధిదారుడు మృతిచెందితే వెంటనే ప్రభుత్వానికి నివేదించాలన్న బాధ్యత కొందరు కుటుంబ సభ్యుల్లో లోపిస్తోంది. దీనికితోడు అనర్హులు, అక్రమార్కులు కూడా ఒకే ఇంటినుంచి నలుగురు వరకు పింఛన్లు పొందుతున్నారు. ఎప్పటికప్పుడు సోషల్‌ ఆడిట్‌ చేసి ఉన్నతాధికారులకు వివరాలు అందించాల్సిన సిబ్బంది మామూళ్ల మత్తులో పడి పట్టించుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. ఇదే తరుణంలో అర్హత ఉండి పింఛన్‌ పొందలేకపోతున్న నిస్సహాయులు అనేక మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్ల అవకతవకలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తేనే పథకం ఆశయం నెరవేరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చనిపోయినా.. బ్యాంకు ఖాతాల్లో జమ

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 76,379మంది ఆసరా పింఛన్‌దారులు ఉన్నారు. కొంతమంది లబ్ధిదారులు చనిపోయినప్పటికీ వారి ఖాతాల్లో సొమ్ము జమవుతూనే ఉంది. వారిలో కొందరు కుటుంబ సభ్యులు ఏటీఎం కార్డుల ద్వారా నగదు డ్రా చేస్తున్నారు. మరికొంతమంది మృతుల ఖాతాల్లో ఏళ్ల తరబడి పింఛన్ల సొమ్ము బ్యాంకుల్లోనే మూలుగుతోంది. భర్త లేదా భార్య వారి స్థానంలో మరొకరి కొత్తగా పింఛన్‌ కావాలంటే మృతిచెందిన ధ్రువీకరణ పత్రం (డెత్‌ సర్టిఫికెట్‌) సమర్పించాలి. ఆ తేదీనుంచి బ్యాంక్‌లో జమ అయినా సొమ్ము తిరిగి బల్దియా ట్రెజరీలో జమ చేస్తేనే దరఖాస్తు స్వీకరించి, విచారణ చేసి, కొత్త పింఛన్‌ కోసం ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఒక్కరే ఉండి, ఇక పింఛన్‌కు ఆస్కారం లేకపోతే ఆ సొమ్ము పక్కదారి పడుతోంది. బల్దియా వ్యాప్తంగా సుమారు 3వేల మంది వరకు అనర్హులు ఉన్నట్లు ఇటీవల జరిగిన తనిఖీల్లో వెలుగు చూసింది. కానీ ఈ విషయాన్ని అధికారులు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అనర్హులకు పింఛన్లు..

ఆధారం లేని వృద్ధులు, వితంతువులు, బీడీ, చేనేత, గీత కార్మికులకు అందుతున్న పింఛన్లలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఒకే ఇంటినంబర్‌పై ఇద్దరు నుంచి నలుగురు బీడీ కార్మికుల పేరిట సర్కారు సొమ్ము దోపిడీ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పింఛన్లను అర్హులకు ఇవ్వాలని, ఇప్పటికే ఉన్న పింఛన్‌దారుల వివరాలను కట్టుదిట్టంగా పరిశీలించి అనర్హులను ఏరివేయాలని ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు ఆదేశిస్తోంది. కానీ జిల్లా అధికారుల పర్యవేక్షణాలోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది విచారణ పేరిట ఎంతో కొంత తీసుకొని వదిలేస్తుండటంతో కోట్లాది రూపాయల సొమ్ము దుర్వినియోగమవుతోంది.

తిరిగి రాబడుతున్నాం..

మృతుల పేరిట ఖాతాల్లో పింఛన్ల నగదు జమ అవుతుందనే విషయం మా దృష్టికి వచ్చింది. పింఛన్ల సొమ్ము పేరుకుపోతే వెంటనే సమాచారం ఇవ్వాలని బ్యాంకర్లకు లేఖలు రాశాం. అనర్హులు ఉంటే ప్రత్యేకంగా సర్వే చేయిస్తాం.

– జోనా, బల్దియా అడిషనల్‌ కమిషనర్‌

మొత్తం పింఛన్ల

లబ్ధిదారులు

76,379

పింఛన్‌ కోసం 16వేల మంది నిరీక్షణ

బల్దియాలో మూడున్నరేళ్లుగా సుమారు 16వేల మంది కొత్త పింఛన్‌ కోసం నిరీక్షిస్తున్నారు. దరఖాస్తు పెట్టుకొని, విచారణ పూర్తయి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండడంతో ఎప్పుడు పింఛన్‌ మంజూరు చేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. అధికారులను అడిగితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని దాటవేస్తున్నారు. దీంతో అర్హులు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement