
మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
రాయపర్తి: పంచాయతీ ఉద్యోగ, కార్మికుల మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) వరంగల్ జిల్లా అధ్యక్షుడు గూడెల్లి ఉప్పలయ్య అధ్యక్షతన ఆదివారం పంచాయతీ ఉద్యోగ, కార్మికులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నిత్యం గ్రామాల్లో అనేక పనులు చేస్తూ సస్యశ్యామలంగా ఉంచుతున్న గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులను మల్టీపర్పస్ విధానం కట్టు బానిసలుగా చేస్తుందన్నారు. అనేక సంవత్సరాలుగా పని చేస్తున్నా పర్మనెంట్ చేయకపోవడంతో పాటు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ, చట్టపరమైన సౌకర్యాలకు నోచుకోని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేస్తామని హామీనిచ్చి మరిచిపోయిందన్నారు. సమస్యల పరిష్కారానికి ఈనెల 23న మహబూబాబాద్ జిల్లా గార్లలో రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలి
నల్లబెల్లి: సంక్షేమ పథకాల పేరుతో యువతను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మేడిపల్లి రాజు గౌడ్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అంతకు ముందు మండల కేంద్రంలో రాజుగౌడ్ తన మద్దతు దారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో సుదర్శన్ రెడ్డి స్వగృహంలో నల్లబెల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నర్సంపేట నియోజకవర్గంలో తాను మంజూరు చేయించిన బీటీ, సీసీ రోడ్లను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రద్దు చేసి గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, పీఎసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడుప్రవీణ్ పాల్గొన్నారు.
పర్యాటకుల సందడి
వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ప్రభుత్వ సెలవు కావడంతో పర్యాటకులు భారీసంఖ్యలో తరలివచ్చి ప్రకృతి అందాలు చూసి ఫిదా అయ్యారు. జలపాతం జలదారలను వీక్షించడంతో పాటు సెల్‌ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. కొలనులో స్నానాలు చేయడంతో పాటు ఫొటోలు, సెల్ఫీలు దిగారు.
భద్రకాళి ఆలయంలో పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి, కన్‌స్ట్రక్షన్ రైల్వే సేఫ్టీ ప్రాజెక్ట్స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఏకే సిన్హా దంపతులు, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ డి.సుబ్రహ్మణియన్ కుటుంబసమేతంగా సందర్శించారు. ఈఓ శేషుభారతి వారిని ఆలయమర్యాదలతో స్వాగతించారు. వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే, వనమహోత్సవంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దేవాలయ ప్రాంగణంలో ఈఓ శేషుభారతి మొక్కలు నాటారు.

మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి

మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి