
కోటమైసమ్మకు బంగారు బోనం
సమర్పించిన మంత్రి సురేఖ, వంచనగిరి గ్రామస్తులు
గీసుకొండ: మండల పరిధిలోని కోటగండి కోట మైసమ్మకు బంగారు బోనాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దంపతులు, భక్తులు, వంచనగిరి వాసులు ఆదివారం సాయంత్రం భారీగా తరలివచ్చారు. అమ్మవారి బోనాల సందర్భంగా మంత్రి కొండా సురేఖ, భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కూతురు సుస్మితా పటేల్, మనవరాలు శ్రేష్టా పటేల్, అల్లుడు అభిలాష్‌తో పాటు వారి అభిమానులు, గ్రామస్తులు తరలిరావడంతో జాతర వాతావరణం నెలకొంది.
భద్రకాళి బోనాలపై వెనక్కి..
భద్రకాళి అమ్మవారి బోనాలను వైభవంగా జరపాలని కోరుకున్నానని, అయితే కొంత మంది ఈ విషయాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్లే వెనక్కి తగ్గినట్లు మంత్రి సురేఖ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రం సుభిక్షంగా, పాడి పంటలతో విరాజిల్లాలని తమ ఇష్టదైవం కోటమైసమ్మను కోరుకున్నానని తెలిపారు. అమ్మవారి దయతో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ తనకు కోట మైసమ్మ తల్లి తప్ప ఇతర విషయాలేవీ తెలియవని పేర్కొన్నారు.