
‘రైతులను ఆదుకోవాలి’
నర్సంపేట: రైతులకు తక్షణం సరిపడా యూరియా, పంట రుణాలు, రూ.2లక్షల రుణమాఫీ చేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఏఐకేఎఫ్(అఖిల భారత రైతు సమాఖ్య) రాష్ట్ర ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏఐకేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వల్లెపు ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వస్కుల మట్టయ్య, ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, సహాయ కార్యదర్శి ఎన్‌రెడ్డి హంసారెడ్డి, ఏఐఏడబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోనె కుమారస్వామి ఆధ్వర్యంలో ఆదివారం ప్రతినిధి బృందం సభ్యులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో గత సంవత్సరం కంటే 40శాతం తక్కువ పంటలు వేసినందుకు తగిన విధంగా వ్యవసాయ ప్రణాళిక రూపొందించి పంట రుణాలు, ఎరువులు, రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల పంటలకు సరిపడా యూరియా దొరకక రోజంతా క్యూలో ఉండి అష్టకష్టాలు పడితే ఒకటి రెండు బస్తాలకు మించి ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షతను మాని రాష్ట్ర కోటాకు అనుగుణంగా యూరియాను పంపించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రభుత్వం తక్షణమే పంట వేసిన ప్రతీ రైతుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రూ.2లక్షల పంట రుణం మాఫీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పోతుగంటి కాశి, వస్సుల కిరణ్, ఇమ్మానుయేల్ తదితరులు పాల్గొన్నారు.