
విద్యార్థినులను జాగ్రత్తగా చూసుకోవాలి
కలెక్టర్ స్నేహ శబరీష్
హసన్‌పర్తి: గురుకుల పాఠశాలలో కొత్తగా ప్రవేశం పొందిన ఐదో తరగతి విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. నగరంలోని పలివేల్పుల క్రాస్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వెల్‌నెస్ సెంటర్‌తో పాటు కిచెన్, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. స్టోర్ రూంలో నిల్వ చేసిన బియ్యం, కూరగాయలు, ఆహార పదార్థాలను పరిశీలించారు. టాయిలెట్లతో పాటు విద్యాలయ పరిశుభ్రతపై ఆరా తీశారు. హాస్టల్‌లో ఏర్పాటు చేసిన ఫోన్ సౌకర్యం గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుభాషినితో పాటు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.