
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఎల్కతుర్తి: వర్షాకాలం సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలు, రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వైద్య సిబ్బందిని డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య హెచ్చరించారు. భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడంతో పాటు ఎన్‌సీడీ రీ స్క్రీనింగ్ ప్రారంభించాలని సూచించారు. ఆస్పత్రి ఆధ్వర్యంలో హైపర్‌టెన్షన్, డయాబెటిస్ రోగులకు క్రమం తప్పకుండా మందులు అందించాలన్నారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఇళ్లల్లోకి దోమలు, ఈగలు ప్రవేశించకుండా కిటికీలు, తలుపులకు జాలీలు బిగించుకొని జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. అంతకుముందు వీర్లగడ్డ తండాలో వాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు టీకాలు వేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్‌రెడ్డి, నివేదిత, వైద్య సిబ్బంది రాజు, తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ అప్పయ్య