
దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం
ధర్మసాగర్/వేలేరు : దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ధర్మసాగర్, వేలేరు మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు శనివారం పంపిణీ చేశారు. ధర్మసాగర్‌లో 924 నూతన రేషన్ కార్డులతో పాటు మండలానికి చెందిన 17మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వేలేరు మండలంలో 439 మందికి కొత్త రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ కొత్తరేషన్ కార్డులు రాని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తున్నట్లు గుర్తుచేశారు. ఆయా కార్యక్రమాల్లో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ధర్మసాగర్ తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, వేలేరు తహసీల్దార్ హెచ్.కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, ఇరు మండలాల అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి