
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, శిక్షణ ఇచ్చేందుకు జిల్లా పరిధిలోని నిరుద్యోగ ట్రాన్స్‌జెండర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి సంక్షేమాధికారి పి.దివ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవింగ్, ఫొటో, వీడియోగ్రఫీ, బ్యుటీషియన్, జ్యూట్‌బ్యాగుల తయారీ, టైలరింగ్, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో నైపుణ్య శిక్షణకు ఈనెల 23లోగా డబ్ల్యూడీఎస్‌సీ.తెలంగాణ.జీఓవీ.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
రాష్ట్రస్థాయి స్విమ్మింగ్
పోటీలకు కాట్రపల్లి విద్యార్థులు
రాయపర్తి: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం నిర్వహించనున్న రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు కాట్రపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్‌ఎం ఝాన్సీలక్ష్మి తెలి పారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈనెల 17న వరంగల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి సబ్ జూనియర్ స్విమ్మింగ్ పోటీల్లో వారు ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న పదో తరగతి విద్యార్థులు గొలుసుల రేవంత్, ఎండీ అలియాజ్, బెల్లి శ్రీరామ్, లకావత్ చరణ్, తొమ్మిదో తరగతి విద్యార్థి ఎండీ అబ్దుల్‌తాహెర్‌తోపాటు పీఈటీ పుట్ట సమ్మయ్యను అభినందించినట్లు హెచ్‌ఎం తెలిపారు కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్ జి.రమ, గ్రామస్తులు పాల్గొన్నారు.
నూతన రేషన్‌కార్డులు మంజూరు
న్యూశాయంపేట: జిల్లాలో అర్హులకు నూతన రేషన్‌కార్డులు మంజూరు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13 మండలాల్లో ఇప్పటివరకు మొత్తం 6,815 రేషన్‌కార్డులు మంజూరు చేయడంతోపాటు 26,766 మంది పేర్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించి, ఇంటింటికి వెళ్లి పరిశీలించినట్లు ఆమె తెలిపారు.
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
సంగెం: కుటుంబ కలహాలతో రైలు పట్టాలపై పడి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని పోలీసులు కాపాడారు. స్థానికుల కథనం ప్రకారం.. కుంటపల్లి గ్రామానికి చెందిన జక్క వేణు కుటుంబ తగాదాలతో గురువారం రాత్రి ఇంట్లో భార్యతో గొడవపడి చింతలపల్లి రైల్వే గేట్ సమీపంలోని పట్టాలపై పడి ఆత్మహత్యకు యత్నించాడు. గేట్‌మెన్ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంగెం పోలీసులు అమీర్‌బాబా, శ్రావణ్ వెంటనే వెళ్లి పట్టాలపై పడుకున్న వేణును కాపాడి కుంటుంబ సభ్యులకు అప్పగించారు. వేణును కాపాడిన పోలీసులను ఎస్సై నరేశ్, ఉన్నతాధికారులు, గ్రామస్తులు అభినందించారు.
లింగ నిర్ధారణ
పరీక్షలు చేస్తే చర్యలు
నెక్కొండ: లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలోని ఉపేందర్ ఆస్పత్రిని శుక్రవారం ఏసీపీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ డోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన ఓ మహిళకు ఉపేందర్ ఆస్పత్రిలో ఇటీవల లింగనిర్ధారణ పరీక్షలు చేసినట్లు సమాచారం అందిందని చెప్పారు. ఇక్కడ లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకున్న మహిళ ఖమ్మం పట్టణం ఖానాపురం హవేలి పరిధిలోని ఓ ఆస్పత్రిలో అబార్షన్‌కు వెళ్లిందని వివరించారు. విషయం తెలుసుకున్న ఖమ్మం డీఎంహెచ్‌ఓ విచారణ చేసి ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు ఖానాపురం హవేలి పోలీస్‌స్టేషన్‌లో జీఓ ఎఫ్‌ఐఆర్ నమోదైందని పేర్కొన్నారు. అక్కడి నుంచి నెక్కొండ పీఎస్‌కు కేసు బదలాయించారని ఆయన వివరించారు. దీంతో ఈ నెల 17న రాత్రి ఆస్పత్రిని నర్సంపేట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్, స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారులతో తనిఖీలు చేశారన్నారు. నెక్కొండ సీఐ శ్రీనివాస్, ఎస్సై మహేందర్‌తో కలిసి ఏసీపీ ఆస్పత్రిని కలియదిరిగారు. ఆస్పత్రి డాక్టర్ ఉపేందర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసి పరారీలో ఉన్న ఆస్పత్రి డాక్టర్ పార్థును త్వరలో అరెస్టు చేస్తామని ఏసీపీ తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం