
స్వచ్ఛతపై దృష్టి
సాక్షి, వరంగల్: వరంగల్ నగరంతోపాటు నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో స్వచ్ఛతకు అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం నిధులు లేక ఇబ్బంది పడుతున్న కార్పొరేషన్, మున్సిలిటీలకు ‘స్వచ్ఛ భారత్ మిషన్ 2.0’ కింద 2025–26 సంవత్సరానికి నిధులు మంజూరయ్యాయి. వాటిని పకడ్బందీగా వినియోగించి చెత్త రహిత ప్రాంతాలుగా మార్చేందుకు అధికారులు దృష్టి సారించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.5,59,51,509, నర్సంపేట మున్సిపాలిటీకి రూ.6,30,215, వర్ధన్నపేట మున్సిపాలిటీకి రూ.3,16,518 నిధులు మంజూరయ్యాయి. కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం, నీటి వ్యర్థాలు, ఘన వ్యర్థాల నిర్వహణ, బయోమైనింగ్ కార్యక్రమాల నిర్వహణతోపాటు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్)గా ప్రకటించిన పట్టణాల ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజారోగ్య పరిరక్షణ కోసం పారిశుద్ధ్య కార్యక్రమాలు, యాస్సిరేషనల్ టాయిలెట్స్, జీవవైవిధ్య పరిరక్షణ, మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యర్థాల నిర్వహణకు ఈ నిధులు వినియోగించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 2021 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ పథకం ఈ ఏడాది అక్టోబర్‌తో ముగియనుంది.
రెండుసార్లు ప్రత్యేక నిధులు మంజూరు..
స్వచ్ఛభారత్ మిషన్ 2.0లో భాగంగా లక్షలోపు జనాభా కలిగిన పట్టణ, స్థానిక సంస్థలకు 2021 నుంచి ప్రతిఏటా రెండుసార్లు ప్రత్యేక నిధులు మంజూరవుతున్నాయి. ముఖ్యంగా నగరం, పట్టణాల్లో రోజురోజుకూ జనాభా పెరుగుతుండడంతో వ్యర్థాల నిర్వహణ ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే వరంగల్‌లో బయోమైనింగ్ వ్యర్థాల నిర్వహణకు తగిన ప్రాధాన్యమిస్తూ బల్దియా అధికారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. తాజాగా స్వచ్ఛ భారత్ మిషన్ నిధులతో వరంగల్ నగరంతోపాటు నర్సంపేట, వర్ధన్నపేటలో బయోమైనింగ్ వ్యర్థాల నిర్వహణపై అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పుడు వచ్చిన నిధులతో ప్రజారోగ్య పరిరక్షణకు సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ఈ నిధులు పూర్తిస్థాయిలో సరిపోవని, ఉన్న నిధులతో మెరుగ్గా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రంలో తొలిస్థానం, జాతీయస్థాయిలో 84వ స్థానంలో నిలిచింది. ఇంటింటా చెత్త సేకరణ, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా (ఓడీఎఫ్ ప్లస్) నర్సంపేట మున్సిపాలిటీకి రాష్ట్రంలో 77, జాతీయస్థాయిలో 768వ ర్యాంకు వచ్చింది. వర్ధన్నపేట మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో 101వ ర్యాంకు, జాతీయస్థాయిలో 1,101వ ర్యాంకు వచ్చింది.
‘స్వచ్ఛభారత్ మిషన్ 2.0’ నిధులు మంజూరు
బయోమైనింగ్ వ్యర్థాల నిర్వహణకు అధికారుల ప్రణాళిక
జీడబ్ల్యూఎంసీ, మున్సిపాలిటీల్లో మెరుగుపడనున్న సౌకర్యాలు

స్వచ్ఛతపై దృష్టి