
మరోమారు కాంగ్రెస్ ప్రభుత్వమే..
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
గీసుకొండ: రాష్ట్రంలో మరోమారు కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి జోస్యం చెప్పారు. కొనాయమాకులలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం ఆయన 294 మందికి కొత్తగా రేషన్‌కార్డుల మంజూరు పత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. పరకాల, నర్సంపేట మాజీ ఎమ్మెల్యేలు సీఎం రిలీఫ్ ఫండ్‌ను దుర్వి నియోగం చేశారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, కల్యాణలక్ష్మి పథకం విషయంలో వసూళ్లకు పాల్పడితే కాంగ్రెస్ నాయకులను పార్టీకి దూరం చేస్తామని హెచ్చరించారు. అలాంటివి ఏమైనా జరిగితే తనకు నేరుగా ఫోన్ చేయాలని ఆయన సూచించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, జిల్లా పౌరసరఫరాల అధికారి సంధ్యారాణి, తహసీల్దార్ రియాజుద్దీన్, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ పాక శ్రీనివాస్, ఏపీఎం సురేశ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు చాడ కొమురారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్, జక్కుల సరిత, కొండేటి కొమురారెడ్డి, గోదాసి చిన్న తదితరులు పాల్గొన్నారు.
అధికారులను హడలెత్తించిన ఎమ్మెల్యే..
రేషన్ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే అధికారులను హడలెత్తించారు. సంక్షేమ పథకాల సమాచారం ఇవ్వాలని ఆయన ఏపీఎం సురేశ్‌కుమార్, అధికారులను ఆదేశించారు. అప్పటికప్పుడు సమాచారం ఇవ్వలేక వారు ఇబ్బందులు పడ్డారు. పలు పథకాల గురించి ఎమ్మెల్యే ప్రశ్నించడంతో అధికారులు కంగుతిన్నారు. అయితే తన ‘కొడుకు’ సమాచారం ఇస్తాడంటూ పక్కనే ఉన్న వ్యక్తిగత పీఏ నుంచి ఆయన కొన్ని వివరాలను తీసుకుని మాట్లాడారు. అంతకు ముందు ఎమ్మెల్యే కొనాయమాకుల రైతు వేదిక వద్ద మొక్కలు నాటి, కొమ్మాల బస్టాండ్ వద్ద అంగడి కోసం రూ.52 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.