
మహిళలను కోటీశ్వరులను చేస్తాం..
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట సిటిజన్ క్లబ్‌లో శుక్రవారం ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రేషన్‌కార్డులు, మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాలు, వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 10,209 మందిని అదనంగా చేర్చి, 2,064 నూతన రేషన్‌కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 6,968 స్వయం సహాయక సంఘాల్లో 73,969 మంది సభ్యులు ఉన్నారని, 5,045 అర్హత గల సంఘాలకు రూ.20.25 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. కార్యక్ర మంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, డీఎస్‌ఓ కిష్టయ్య, ఆర్డీఓ ఉమారాణి, నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీశ్‌రెడ్డి, నర్సంపేట మార్కెట్ వైస్ చైర్మన్ హరిబాబు, సొసైటీ చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.