
మా పని మాకు కల్పించాలి
కమలాపూర్: ‘మా పని మాకు కల్పించాలి.. పనికి తగిన వేతనం చెల్లించాలి’ అని కమలాపూర్ మండలం ఉప్పల్‌లో బొగ్గు లారీలను అడ్డగించి లోడింగ్, అన్ లోడింగ్ కార్మికులు గురువారం నిరసన ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా కాంట్రాక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం లోడింగ్, అన్ లోడింగ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. నేతాజీ రైల్వే లోడింగ్, అన్ లోడింగ్ యూనియన్‌లో 287 మంది కార్మికులు ఉన్నామని, తామంతా బొగ్గు, గ్రానైట్, బియ్యం, మొక్కజొన్నలు వంటివి లోడింగ్, అన్‌లోడింగ్ చేసే వాళ్లమన్నారు. అందుకు కాంట్రాక్టర్లు తమకు ఒక్కో వ్యాగిన్‌కు రూ.11 వేలు చెల్లించే వారన్నారు. గతంలో కాంట్రాక్టర్ విజేందర్‌రెడ్డి తనకు మళ్లీ కాంట్రాక్ట్ దక్కితే ఒక్కో వ్యాగన్‌కు రూ.15 వేలు చెల్లిస్తానని చెప్పాడన్నారు. కానీ.. అతడి కాంట్రాక్ట్ ముగిసిందని, ప్రస్తుతం కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నర్సింగరావు తాను తక్కువ మొత్తానికి కాంట్రాక్ట్ వేశానేని తనకు కు ఇంత మంది కార్మికులు అవసరం లేదంటున్నాడని వాపోయారు. కేవలం పది మంది కార్మికులు సరిపోతారని అంటున్నాడని, కేవలం రూ.6 వేలు మాత్రమే చెల్లిస్తానంటున్నాడన్నారు. కాంట్రాక్టర్ తీరుతో 270 మందికి పైగా కార్మికులు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా 287 మందికి పని కల్పించి, పనికి తగిన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. శ్రమ దోపిడీ చేస్తున్న కాంట్రాక్టర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఒక్క లారీని కూడా కదలనివ్వమని హెచ్చరించారు. ఈనిరసనలో నేతాజీ రైల్వే లోడింగ్ యూనియన్ అధ్యక్షుడు జక్కుల రాజు, ఉపాధ్యక్షుడు పుల్ల విజయ్‌చందర్, లోడింగ్, అన్ లోడింగ్ కార్మికులు పాల్గొన్నారు.
ఉప్పల్‌లో బొగ్గు లారీలు ఆపి లోడింగ్ కార్మికుల నిరసన ఆందోళన