
మూతబడి..!
మూణ్నాళ్లకే
చొరవ చూపిస్తేనే ముందుకెళ్లేది..
● నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామ శివారు హేమ్లా తండా ప్రాథమిక పాఠశాల 2022లో విద్యార్థులు లేకపోవడంతో మూసివేశారు. అక్కడి ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై వేరే పాఠశాలలకు పంపించారు. ఈ ఏడాది బడిబాటలో భాగంగా ఈ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు చేరడంతో ఉపాధ్యాయురాలు విజయరాణి పాఠాలు బోధిస్తున్నారు.
● విద్యార్థులు లేకపోవడంతో నర్సంపేట మండలంలోని రాజపేట గ్రామశివారు చింతగడ్డతండా ప్రాథమిక పాఠశాల 2022లో మూతబడింది. ఈ ఏడాది బడిబాటలో భాగంగా ఒకటో తరగతిలో ముగ్గురు, రెండో తరగతిలో నలుగురు విద్యార్థులు చేరారు. ఈ ఏడుగురు విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు గోవర్ధన్ పాఠాలు చెబుతున్నారు.
● నల్లబెల్లి మండలం గొల్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేకపోవడంతో 2022లో మూతబడింది. ఈ ఏడాది బడిబాటలో భాగంగా ఉపాధ్యాయుల చొరవతో 10 మంది విద్యార్థులు చేరడంతో తిరిగి ప్రారంభమైంది. ఈ మూడు పాఠశాల్లో ఉపాధ్యాయులు రెగ్యులర్ వచ్చి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తేనే ఇవి కొనసాగుతాయి. లేదంటే ఇప్పటికే రీ ఓపెన్ అయి రోజుల వ్యవధిలోనే మూతబడిన పాఠశాలుగా మారే ప్రమాదముంది.
సాక్షి, వరంగల్: బడిబాట కార్యక్రమంలో విద్యార్థులు చేరిన 6 జీరో ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. పట్టుమని 10 రోజులు కాకముందే వీటిలో మూడు పాఠశాలలు మళ్లీ మూతబడడం ఆందోళన కలిగిస్తోంది. సర్కారు స్కూళ్లకు పంపండి.. చదువుతోపాటు పౌష్టికా హారం, ఉచిత పాఠ్యపుస్తకాలు, డ్రెస్సులు, కంప్యూటర్ క్లాస్‌లు ఉన్నాయంటూ ఉపాధ్యాయులు వందలాది మంది విద్యార్థులను చేర్పించారు. ఉపాధ్యాయుల్లో కొందరు ఆ సంఖ్యను కొనసాగించడంలో విఫలమవడంతో తిరిగి ప్రారంభమైన జీరో స్కూ ల్స్ మూతబడ్డాయి. అమ్మమ్మ ఇంటి వద్దకు వచ్చి ఈ బడుల్లో చేరిన వారు తిరిగి వెళ్లిపోగా.. ఉపాధ్యాయులు సమయానికి రాక ఇంకొందరు విద్యార్థులు,పాఠశాలల పరిసరాలు అంతా చెట్లమయంగా ఉండడం, అపరిశుభ్ర వాతావరణం, పాములు, విషపురుగుల వంటి బెడద ఉందని మరికొందరు ఈ జీరో స్కూల్స్‌కు దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది. కారణాలు ఏమైనా విద్యార్థులకు ప్రభుత్వ బడి చదువులపై ఆసక్తి కలిగించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోకపోవడం వల్లనే ఇలా జరిగిందని విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అమ్మమ్మ ఇంటి నుంచి వెళ్లడంతో..
విద్యార్థులు లేకపోవడంతో నల్లబెల్లి మండలం కొండాయిల్‌పల్లి ప్రాథమిక పాఠశాలను 2024లో మూసివేశారు. ఈ ఏడాది బడిబాటలో భాగంగా అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్న ఇద్దరు చిన్నారులు పాఠశాలలో చేరారు. జూలై తొలివారం వరకు హాజరైన ఆ విద్యార్థులు తర్వాత వారి నానమ్మ ఇంటి వద్దకు వెళ్లారు. ఇలా విద్యార్థులు బడికి గైర్హాజరవడంతో ఉపాధ్యాయులు ఖాళీగా ఉంటున్నారు.
పాము కాటు భయంతో దూరంగా..
బడిబాటలో భాగంగా ఉపాధ్యాయులు నచ్చజెప్పడంతో నలుగురు విద్యార్థులు చేరడంతో పర్వతగిరి మండలం భట్టుతండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభమైంది. గతంలో ఈ బడిలోనే ఓ విద్యార్థి పాముకాటుకు గురై మృత్యువాతపడ్డాడు. ఇప్పటికీ ఈ పాఠశాల పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల అడ్మిషన్లు తీసుకున్న నలుగురు విద్యార్థులు కాస్త మళ్లీ వెనుకంజ వేయడంతో ఈ బడి మూతబడినట్లయ్యింది. ఆ విద్యార్థులు వేరే పాఠశాలకు వెళ్తున్నారు.
ఒక్కొక్కరు చేజారడంతో..
సంగెం మండలంలోని ముమ్మిడివరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేక 2018లో మూతబడింది. అయితే ఈ ఏడాది బడిబాటలో భాగంగా 10 మంది విద్యార్థులు చేరడంతో పునఃప్రారంభమైంది. రోజులు గడుస్తున్నా కొద్దీ ఒక్కొక్కరు పాఠశాలకు రాకపోవడంతో ఇప్పుడు ఆ సంఖ్య మళ్లీ జీరోకు చేరింది. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కుమారస్వామిని తిరిగి డిప్యుటేషన్‌పై మొండ్రాయిలోని ప్రభుత్వ పాఠశాలకు పంపించారు.
ఈఏడాది ప్రారంభమైన 6 జీరో
స్కూళ్లలో మూడు మూసివేత
ఉపాధ్యాయుల చొరవ, పరిసరాల
శుభ్రత లేకపోవడమే కారణం