
జిల్లాకు ‘కాయకల్ప’ అవార్డులు
గీసుకొండ: జిల్లాకు కాయకల్ప అవార్డుల పంట పండింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, జాతీయ హెల్త్‌మిషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా 2024–2025 సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఈ అవార్డుకు మెరుగైన వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు, కలిగి ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. వాటిలో జిల్లా నుంచి మొత్తం 22 ఆరోగ్య కేంద్రాలు కాయకల్ప అవార్డుకు ఎంపికై నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు గురువారం తెలిపారు.
ఎంపికై న పీహెచ్‌సీలు..
జిల్లాలో 14 పీహెచ్‌సీలు ఉన్నాయి. వాటిలో గీసుకొండ, పర్వతగిరి, సంగెం, నెక్కొండ, నల్లబెల్లి, మేడపల్లి, కేశవాపూర్, అలంకానిపేట, పైడిపల్లి పీహెచ్‌సీలు కాయకల్ప అవార్డుకు ఎంపికయ్యాయి. ఈ అవార్డు కింద ఎంపికై న 9 పీహెచ్‌సీలకు రూ.6 లక్షల నగదు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు.
యూపీహెచ్‌సీలు..
జిల్లాలో ఏడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటిలో కీర్తినగర్, దేశాయిపేట, చింతల్ పీహెచ్‌సీలను అవార్డుకు ఎంపిక చేశారు. వీటికి రూ.మూడు లక్షలను ప్రోత్సాహకంగా అందిస్తారు.
12 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ఏఏఎం)..
జిల్లాలో నర్సంపేటలో మూడు, అశోక్‌నగర్‌లో ఒకటి, తిమ్మంపేట, రెడ్లవాడ, ఇటుకాలపల్లి, ధర్మా రం, అమీనాబాద్, కోనాపురం, తూర్పుతండా, గవిచర్లలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఎంపిక చేశారు. వీటికి రూ.2.60 లక్షలను నగదు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు.
కలెక్టర్ అభినందనలు..
జిల్లాలోని 22 ఆరోగ్యకేంద్రాలు జిల్లాస్థాయి కాయకల్ప అవార్డుకు ఎంపిక కావడంతో కలెక్టర్ సత్యశారద వైద్యాధికారులు, సిబ్బందిని అభినందించిన ట్లు డీఎంహెచ్‌ఓ బి.సాంబశివరావు తెలిపారు. ఆరోగ్య జిల్లాగా మార్చడానికి వైద్య, ఆరోగ్య వి భాగం మరింత కృషి చేయాలని ఆయన కోరారు.
కాయకల్ప కార్యక్రమం ఇలా..
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఆధ్వర్యంలో కాయకల్ప కార్యక్రమం ప్రారంభమైంది. ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత పాటించడం, ఇన్‌ఫెక్షన్ సోకకుండా చర్యలు చేపట్టేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిశుభ్రత, పారిశుధ్ధ్యం విషయాల్లో ఉన్నత ప్రమాణాలను పాటించే వారికి స్వచ్ఛభారత్ అభియాన్–2015లో భాగంగా కాయకల్ప అవార్డులు ఇస్తున్నారు. ఏదైనా ఆరోగ్య కేంద్రం పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, సౌకర్యాల నాణ్యతను పెంపొందించే విషయంలో 70 శాతం స్కోర్ చేస్తే అవార్డుకు ఎంపిక చేస్తున్నారు. అవార్డు ఎంపిక కోసం ప్రతీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీ పరిశీలించి స్కోర్ ఇస్తుంది.
22 ఆరోగ్య కేంద్రాలను
ఎంపిక చేసిన ప్రత్యేక కమిటీ
వీటిలో 9 పీహెచ్‌సీలు,
3 యూపీహెచ్‌సీలు, 12 ఏఏఎంలు