
మహిళల భద్రత కోసమే షీటీంలు
నర్సంపేట: మహిళలు, విద్యార్థినులకు భద్రతపై భరోసా కల్పించేందుకే నర్సంపేటలో షీటీం ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ఈ మేరకు పోలీస్ సిబ్బంది నివాస ప్రాంగణంలో షీ టీం కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. నర్సంపేట షీటీం తొలి ఎస్సై స్వాతికి పోలీస్ కమిషనర్ మొక్క అందజేసి అభినందించారు. నర్సంపేటలోని షీ టీం విభాగం నిర్వర్తించాల్సిన విధుల గురించి షీ టీం ఏసీపీ సదయ్య పోలీస్ కమిషనర్‌కు వివరించారు. విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించాలని సీపీ అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం మూడు షీ టీంలు పనిచేస్తున్నాయని, ఎవరైనా ఆకతాయిలు మహిళలను వేధించినా, లైంగిక వేధింపులకు గురిచేసినా తక్షణమే నర్సంపేట షీ టీం విభాగం ఫోన్‌నంబర్ 8712552326కు సమాచారం అందించాలన్నారు. రానున్న రోజుల్లో జనగామ జిల్లా కేంద్రంలోను షీ టీం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, ఏసీపీలు రవీందర్‌రెడ్డి, సదయ్య, వరంగల్ పోలీస్ కమిషనరేట్ షీ టీం ఇన్‌స్పెక్టర్ సుజాత, నర్సంపేట ఇన్స్‌పెక్టర్ రఘు, దుగ్గొండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సాయిరమణ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్లను సందర్శించిన సీపీ..
పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ గురువారం నర్సంపేట డివిజన్ పరిధిలోని నర్సంపేట, దుగ్గొండి, ఖానాపురం పోలీస్‌స్టేషన్లతోపాటు నర్సంపేట ఏసీపీ, దుగ్గొండి సర్కిల్ పోలీస్ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని, రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని సిబ్బందికి సూచించారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్