
పని వదులుకుని.. పడిగాపులు
శాయంపేట: పని వదులుకుని పడిగాపులు కాసినా ప్రయోజనం లేకుండా పోతోంది. లైన్‌లో నిల్చున్న సగం మందికి సైతం యూరియా బస్తాలు అందడం లేదు. శాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ గోదాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు యూరియా బస్తాల్ని బుధవారం అందజేశారు. ఈక్రమంలో ఉదయం 8 గంటల నుంచే రైతులు బారులుదీరారు. వీరితో పాటు మహిళా రైతులు సైతం క్యూ లైన్లలో యూరియా బస్తాల కోసం నిరిక్షీంచారు. మండలానికి గత మూడు రోజుల క్రితం కేవలం 312 బస్తాల యూరియా మాత్రమే రావడంతో రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. పీఏసీఎస్ సిబ్బంది ఒక్కో రైతుకు 2 యూరియా బస్తాలు మాత్రమే ఇచ్చారు.
తప్పని తిప్పలు
కమలాపూర్: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పట్లేదు. యూరియా వచ్చిందని తెలియగానే వ్యవసాయ పనులన్నీ వదులుకుని గంటల తరబడి క్యూ కడుతున్నారు. కమలాపూర్ పీఏసీఎస్‌కు బుధవారం 444 బస్తాల యూరియా వచ్చింది. సమాచారమందుకున్న రైతులు పెద్ద ఎత్తున పీఏసీఎస్ వద్ద బారులు తీరరు. మరి కొందరు క్యూలైన్‌లో చెప్పులు ఉంచారు. యూరియా పంపిణీ సమయంలో తోపులాడుకున్నారు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ, ఎస్సై మధు, సిబ్బందితో అక్కడకు చేరుకుని రైతులను క్యూలైన్లో పంపించారు. ఒక్కొక్కరికి 3 బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేయించారు. అయినప్పటికీ రైతులందరికీ యూరియా రాకపోవడంతో సగం మంది నిరాశతో వెనుదిరిగారు.
సగం మందికి సైతం దొరకని యూరియా బస్తాలు
మహిళా రైతులు సైతం క్యూ లైన్‌లో..
నానో యారియా ప్లస్ అంటగడుతున్నారని రైతుల ఆవేదన
రెండు బస్తాలే ఇచ్చారు..
నాకు ఆరెకరాల సొంత భూమి ఉంది. మరో ఆరెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నా. 12 ఎకరాలకు 36 బస్తాల యూరియా అవసరం పడుతుంది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పడిగాపులు కాస్తే పీఏసీఎస్ వారు 2 బస్తాల యూరియా ఇచ్చారు. దానికి తోడు రూ.225 విలువైన అర లీటర్ నానో యూరియా ప్లస్ బాటిల్ అంటగట్టారు. నానో యూరియా ప్లస్ వద్దు అంటే యూరియా బస్తాలు ఇచ్చేలా లేరు. ప్రభుత్వం చొరవ తీసుకుని నానో యూరియా ప్లస్ లింక్ పెట్టకుండా సరిపడా యూరియా అందించాలి.
– రూపిరెడ్డి రాజిరెడ్డి, రైతు పత్తిపాక

పని వదులుకుని.. పడిగాపులు

పని వదులుకుని.. పడిగాపులు