
ఇళ్లు పూర్తయితేనే అదనంగా ఇస్తాం..
పరకాల: లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుంటేనే ఆయా గ్రామాలకు అదనంగా ఇళ్లు మంజూరు చేస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకోవచ్చని సూచించారు. పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై పరకాల మండల, మున్సిపాలిటీ పరిధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాలవారీగా, వార్డుల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై అధికారులను, ఇందిరమ్మ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు దశలవారీగా అర్హులైనవారందరికీ మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణ పనులు పూర్తికాగానే నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డబ్బులు వస్తాయన్నారు. సమావేశంలో పరకాల ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు, తహసీల్దార్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సుష్మ, వార్డు అధికారులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధికారులతో సమీక్ష