
కార్మికులు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి
వరంగల్ అర్బన్ : కార్మికులు పనిచేయడంతోపాటు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి కోరారు. ‘నమస్తే’ కార్యక్రమంలో భాగంగా బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో డి స్లడ్జింగ్ ఆపరేటర్లు, డీఆర్‌సీసీ రాక్ పిక్కర్స్‌తో మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సమావేశమయ్యారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారిని శాలువాలతో సత్కరించారు. అర్హులకు ఒక్కరికి రూ.5లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులు, పీపీఈ కిట్‌లు, గుర్తింపు కార్డులను అందజేశారు. సమావేశంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి..
పారిశుద్ధ్య జవాన్లు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జవాన్లతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి వెన్నెముక వంటి వారన్నారు. జవాన్లు ప్రతీరోజు నాలుగు సార్లు బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని, మ్యాన్యువల్ హాజరును పరిగణనలోకి తీసుకోరన్నారు. 15 రోజులు విధులకు గైర్హాజరైతే ఔట్ సోర్సింగ్ జవాన్లను విధుల నుంచి తొలగిస్తామన్నారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల తనిఖీ
బల్దియా పరిధి కొత్తపేట పైడిపల్లి, నవభారత్ కాలనీ ప్రాంతాల్లో పూర్తయిన అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుపై కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో నిర్మించిన అంతర్గత రోడ్లు, డ్రెయిన్ల నాణ్యత, రోడ్డు వెడల్పు, లోతు పరిశీలించారు. ఎంబీ రికార్డ్ ప్రకారమే బిల్లులు మంజూరు చేస్తామని, నాణ్యతలో లోపం ఉంటే కోతలు విధిస్తామన్నారు. తనిఖీల్లో ఈఈ సంతోశ్‌బాబు, స్మార్ట్ సిటీ పీఎంఈ ఆనంద్ వోలేటి, డీఈ రవికిరణ్, ఏఈలు ఉన్నారు.
‘నమస్తే’ కార్యక్రమంలో మేయర్, కమిషనర్