
యూరియా బస్తాల సీజ్
● కేసు నమోదు
నల్లబెల్లి: మండల కేంద్రంలోని ఖాజా మొయినుద్దీన్ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ షాపులో 213 యూరియా బస్తాలను మంగళవారం సీజ్ చేసి షాపు యజమాని ఎండీ హైమద్‌పై కేసు నమోదు చేసినట్లు మండల వ్యవసాయాధికారి బన్న రజిత తెలిపారు. షాపును తనిఖీ చేసిన తను ఈపాస్ మెషిన్, బిల్లు బుక్కు, తదితర రికార్డుల్లో తేడాలను గుర్తించడంతోపాటు ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు తీసుకవెళ్లినట్లు రికార్డులో ఉన్న రైతులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నట్లు తెలిపారు. ఆయా రైతులు యూరియా తీసుకుపోలేదని చెప్పడంతో చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొన్నారు. ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఓ వెంట ఏఈఓలు ఉన్నారు.
ఉపకార వేతనాలకు
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న అర్హులైన బీసీ విద్యార్థులు ఈ విద్యాసంవత్సరానికి ప్రీ–మెట్రిక్ ఉపకార వేతనాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి పుష్పలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్హత, తదితర ధ్రువీకరణ పత్రాలతో తెలంగాణ ఈపాస్.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని తెలిపారు. ఇతర వివరాలకు హనుమకొండ లష్కర్ బజార్‌లోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో బీసీ సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
కార్డులు ఉన్నవారికే
యూరియా ఇవ్వాలి
● జిల్లా వ్యవసాయశాఖ
అధికారి అనురాధ
దుగ్గొండి: గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న రైతులకు అందించిన ఎరువుల కార్డులు కలిగిఉన్న వారికే యూరియా అందించాలని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ సిబ్బందికి సూచించారు. మండలంలోని మందపల్లి పీఏసీఎస్‌లో యూరియా పంపిణీ, ఎరువుల కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె మంగళవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. రైతులు తమకు మ్యాపింగ్ చేసిన గ్రామాల్లోనే ఎరువులు తీసుకోవాలన్నారు. ఒక సొసైటీ పరిధి రైతులు మరో సొసైటీ పరిధిలో తీసుకోకూడదని తెలిపారు. అవసరం ఉన్నంతమేరకే యూరియా తీసుకోవాలని రైతులకు చెప్పారు. ప్రతి వారం యూరియా వస్తూందని తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ గుడిపెల్లి శ్రీనివాసరెడ్డి తమ సొసైటీకి వచ్చే యూరియా సరిపోవడం లేదని కోటా పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ మాధవి, ఏఈఓలు హన్మంతు, వైజయంతి, విజయ్‌కుమార్, రాజేష్, సొసైటీ సిబ్బంది రంగు వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి కామిక్ రాత
పరీక్ష పోటీలు
ఖిలా వరంగల్: ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా నగరంలోని రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు జిల్లా స్థాయి కామిక్ రాత పరీక్ష పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఏఎంఓ సృజన్ తేజ హాజరై పోటీలను ప్రారంభించారు. పోటీల్లో ప్రథమ విజేతగా రంగశాయిపేట ఉన్నత పాఠశాల విద్యార్థి చరిత, ద్వితీయ విజేతగా సీహెచ్ దాక్షాయణి (జెడ్పీహెచ్‌ఎస్ ఉప్పరపల్లి), మూడో విజేతగా జి.రేణుక (జెడ్పీహెచ్‌ఎస్ మామునూరు క్యాంప్ హై స్కూల్) నిలిచారు. సృజన్‌తేజ వీరికి ప్రశంస పత్రాలతోపాటు బహుమతులను అందజేసి, మాట్లాడారు. విజేతలను త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి కామిక్ రాత పరీక్ష పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డి నేటర్ సీహెచ్ నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు రామకష్ణారెడ్డి, జ్యూరీ కమిటీ సీహెచ్ కృష్ణారెడ్డి, లక్ష్మణ్, సీఆర్పీ వెంకటాచారి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

యూరియా బస్తాల సీజ్

యూరియా బస్తాల సీజ్