
కలెక్టరేట్ భవన నిర్మాణంలో వేగం పెంచాలి
● కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణంలో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ పాత ఆజంజాహి మిల్స్ గ్రౌండ్‌లో నిర్మిస్తున్న కలెక్టరేట్ పనులను మంగళవారం కలెక్టర్ సందర్శించారు. కలెక్టరేట్ మూడు అంతస్తుల నిర్మాణాలు, కలెక్టర్ క్వార్టర్స్, అడిషనల్ కలెక్టర్ క్వార్టర్స్, మొదటి, రెండో అంతస్తులో డిజైన్ ప్రకారం పనులు జరుగుతున్నాయా.. లేదా.. అని పరిశీలించారు. స్ట్రక్చరల్ పనులు పూర్తయినందున ఫినిషింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని అవసరమైన సిబ్బంది, వనరులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు, ప్రహరీ పైప్ లైన్ తదితర నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట డీఆర్‌ఓ విజయలక్ష్మి, జిల్లా రోడ్డు భవనాల అధికారి రాజేందర్, డీఈ శ్రీధర్, నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ సందీప్‌రెడ్డి ఉన్నారు.
పాఠశాలల్లో గ్యాస్ కనెకన్ల ఏర్పాటు చర్యలు
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు గ్యాస్ కనెక్షన్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు, గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. కట్టెల పొయ్యితో కాకుండా గ్యాస్ ద్వారా వంటలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందుకు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు సహకరించాలని చెప్పారు. ప్రతి మండలానికి 35 నుంచి 40 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నందున ఆయా మండల ఏజెన్సీల నుంచి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేలా చూడాలని ప్రతినిధులను కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఈఓ జ్ఞానేశ్వర్, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు తదితర జిల్లా అధికా రులు గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.