
మతతత్వ రాజకీయాలతో ప్రజలను విభజిస్తున్న బీజేపీ
నర్సంపేట: మతతత్వ రాజకీయాలతో దేశ ప్రజలను బీజేపీ విభజిస్తుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. సీపీఐ సీనియర్ నాయకుడు సుంకరనేని బాలనర్సయ్య జెండా ఆవిష్కరించిన అనంతరం పట్టణంలోని మేర భవన్‌లో గడ్డం నాగరాజు, పిట్టల సతీష్ అధ్యక్షతన మంగళవారం సీపీఐ మండల 14వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ పాలనలో ప్రజాస్వామ్యం గొంతునొక్కుతూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తులకు దాసోహం అయిందని పేర్కొన్నారు. రచయితలు, కవులు, కళాకారులు, విద్యావేత్తలను అణిచివేస్తూ ప్రజాస్వామ్యం మంటగలుపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదల గుడిసెలు, ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని కోరారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం ఆదివాసీలను హత్య చేస్తుందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర సమితి సభ్యుడు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ బాసుమియా, పనాస ప్రసాద్, జిల్లా కార్యవర్గసభ్యులు అక్కపల్లి రమేష్, గుంపెల్లి మునీశ్వర్, గుండె బద్రి, తోట చంద్రకళ, సీపీఐ జిల్లా సమితి సభ్యులు కందిక చెన్నకేశవులు, దిడ్డి పార్ధసారథి, గోవర్ధన్, కవిత, యాకయ్య, సతీష్, సాంబయ్య, మమత, శైలజ, నాగరాజు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
శ్రీనివాసరావు