
ఆయిల్‌పామ్ తొలిపంట ప్రారంభం
దుగ్గొండి: మండలంలోని పలు గ్రామాల్లో నాలుగు సంవత్సరాల క్రితం సాగుచేసిన ఆయిల్‌పామ్ తొలిపంట ప్రారంభం అయింది. ఈ మేరకు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో రైతులు మాగంటి కిరణ్మయి, బాలమోహన్ వ్యవసాయక్షేత్రంలో మంగళవారం గెలలు తెంపడం ప్రారంభించారు. దీంతో రైతు బాలమోహన్‌ను జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు శాలువాలతో సన్మానించి, మాట్లాడారు. ప్రతి 15 రోజులకు ఒకసారి గెలలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మార్కెట్‌లో ప్రస్తుతం టన్నుకు రూ.21 వేలు పలుకుతుందన్నారు. గెలలు తీసే రైతులు ముందుగా ఉద్యానశాఖ అధికారులు, రామ్‌చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ప్రతినిధులకు సమాచారం అందిస్తే నర్సంపేటలోని పికప్ పాయింట్ నుంచి కాంటా వేసి తీసుకోవడం జరుగుతుందన్నారు. కొత్తగా సాగు చేయాలనుకునే రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను అధికారులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో రామ్‌చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ జీఎం సతీష్‌నారాయణ, డివిజన్ ఉద్యానశాఖ అధికారి జ్యోతి, రైతులు బాబురావు, సంపత్‌రావు, రమేష్, జైపాల్‌రెడ్డి, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.