
ఆర్థిక బిల్లుతో పెన్షనర్లకు అన్యాయం
హన్మకొండ అర్బన్: ఆర్థిక బిల్లులో భాగంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తీసుకొచ్చిన చట్టంతో పెన్షనర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తూపురాణి సీతారాం అన్నారు. ఆలిండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌జీపీఎఫ్) పిలుపు మేరకు మంగళవారం టాప్రా జిల్లా కమిటీ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 25న చేసిన చట్టంతో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఆ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా అమలు చేస్తాయని తెలిపారు. బడ్జెట్ మిగిలించుకునేందుకు రాష్ట్రాలు కూడా దీని అమలుకు ప్రయత్నిస్తాయని వివరించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పోరాటం చేయకపోతే పెన్షనర్లు తమ ప్రయోజనాలు సంపూర్ణంగా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ఈ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్‌కు వినతిపత్రం అందజేశారు. టాప్రా జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణగిరి వీరన్న, బాధ్యులు పెండ్యాల బ్రహ్మయ్య, శంకరలింగం, సత్యనారాయణ, పీఎల్‌ఎన్ రావు, విద్యాదేవి, ప్రభాకర్‌రెడ్డి, సిద్ధి రాజయ్య, వెంకటేశ్వరస్వామి, మేరీ, సమ్మయ్య, సంపత్‌కుమార్, వనజ, రాజమల్లు పాల్గొన్నారు.
టాప్రా జిల్లా అధ్యక్షుడు సీతారాం
హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా