
నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి
కమలాపూర్: విద్యార్థులకు నాణ్యమైన విద్య, రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల, సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో తరగతి గదులు, బోధన, భోజనశాల, వంటలు, మెనూ చార్ట్‌ను పరిశీలించి వసతుల గురించి ఆరా తీశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అదిస్తున్నారా అని విద్యార్థులు, గురుకుల పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని తరగతి గదుల్లో విద్యార్థులు నేలపై కూర్చోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వనమహోత్సవంలో భాగంగా ఒక మొక్క నాటారు. అనంతరం సీహెచ్‌సీ, పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఎక్స్‌రే, ల్యాబ్, ఔట్, ఇన్ పేషెంట్ విభాగాలు, ఫార్మసీ, రోగులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. వైద్య సేవలు, ప్రసవాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రసవాలు ఇక్కడే చేయకుండా ఇతర ప్రభుత్వాస్పత్రులకు ఎందుకు రెఫర్ చేస్తున్నారని ఆశ కార్యకర్తలు, సిబ్బందిని మందలించి ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. ఎంజేపీ గురుకులాల ఆర్సీఓ రాజ్‌కుమార్, డీఈఓ వాసంతి, ఎంఈఓ శ్రీధర్, ప్రిన్సిపాల్ రవీందర్, డీసీహెచ్‌ఎస్ గౌతం చౌహాన్, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ నరేశ్, పీహెచ్‌సీ వైద్యాధికారి నాగరాజు, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీఓ బాబు పాల్గొన్నారు.
పంగిడిపల్లి రోడ్డును బాగు చేయించండి..
హెచ్‌పీసీఎల్ గ్యాస్ ప్లాంట్‌కు వచ్చిపోయే భారీ వాహనాలతో దెబ్బతిన్న కమలాపూర్–పంగిడిపల్లి రోడ్డును బాగుచేయాలని పంగిడిపల్లి గ్రామస్తులు కలెక్టర్‌ను వేడుకున్నారు. వర్షాకాలంలో రోడ్డు బురదమయమై ప్రమాదాల బారిన పడుతున్నామని పేర్కొన్నారు. డబుల్ రోడ్డు విస్తరణతో భూములు కోల్పోతున్నామని కొందరు రైతులు కోర్టుకు వెళ్లారని, దీంతో కాంట్రాక్టర్ రోడ్డు పనులు మధ్యలోనే నిలిపి వేశాడని తెలిపారు. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయించాలని కోరారు. మాజీ సర్పంచ్‌లు చేలిక శ్రీనివాస్, వలిగె సాంబరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్