
యూరియా అక్రమ నిల్వలపై రైతుల ఆందోళన
నల్లబెల్లి: యూరియా బస్తాలను అక్రమంగా నిల్వ చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్టిలైజర్ గోదాంపై పెట్రోల్ చల్లి దహనం చేసేందుకు యత్నిస్తూ రైతులు ఆందోళన చేశారు. మండల కేంద్రంలోని కర్ర మల్లారెడ్డి ఫర్టిలైజర్ పెస్టిసైడ్ షాపు గోదాం ఎదుట ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి, రైతులు జుంకీలాల్, ధన్‌రాజ్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. బిల్ నాయక్ తండాకు చెందిన జుంకీలాల్, ధన్‌రాజు.. కర్ర మల్లారెడ్డి ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ షాపునకు వెళ్లి రెండు బస్తాల చొప్పున యూరియా కావాలని అడిగారు. కాగా షాపు యజమాని కృష్ణారెడ్డి తమ వద్ద యూరియా స్టాక్ లేదని తేల్చిచెప్పారు. కనీసం చెరొక బస్తా ఇవ్వాలని కోరినా నిరాకరించారు. దీంతో వారు షాపు నిర్వాహకుల గోదాంకు వెళ్లి చూసి గోదాంలో యూరియా అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. షాపు యజమాని కృష్ణారెడ్డిని నిలదీశారు. విషయాన్ని దాటవేసేందుకు యజమాని ప్రయత్నించగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అక్రమంగా నిల్వ చేసిన గోదాంపై పెట్రోల్ చల్లి దహనం చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న ఎస్సై గోవర్ధన్ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. రికార్డులు పరిశీలించి అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ మేరకు ఏఓ బన్న రజితను వివరణ కోరగా విచారణ చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఫర్టిలైజర్ గోదాం దహనం చేసేందుకు యత్నం
అడ్డుకున్న పోలీసులు