
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అవకాశవాది
కమలాపూర్ : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఒక అవకాశవాది అని, ఓ వైపు బీజేపీని విమర్శిస్తూ.. మరోవైపు వారితో దోస్తాన చేస్తున్నాడని, అతని తీరు చూస్తుంటే త్వరలో బీజేపీలో చేరుతాడనే అనుమానం కలుగుతోందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఒడితల ప్రణవ్ ఆరోపించారు. మండలంలోని 26 మందికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను శనివారం ఆయన కమలాపూర్‌లో పంపిణీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని తెలిపారు. హుజూరాబాద్‌కు కౌశిక్‌రెడ్డి ఐరన్ లెగ్‌గా తయారయ్యాడని, పని చేయడం మానేసి సోషల్ మీడియాలో రీల్స్ చేయడం పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో గడువు తీరినవి లబ్ధిదారులకు పంపిణీ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నాడన్నారు. కమలాపూర్ కాంగ్రెస్‌లో ఎలాంటి గ్రూపులు లేవని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తౌటం ఝాన్సీరాణిరవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
త్వరలో బీజేపీలో చేరుతాడని అనుమానం
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రణవ్