
మోతాదుకు మించి యూరియా వాడొద్దు
సంగెం: రైతులు మోతాదుకు మించి పంటలకు యూరియా వాడొద్దని కలెక్టర్ సత్యశారద సూచించారు. గవిచర్లలోని కాపులకనిపర్తి సొసైటీ ఎరువుల గోదాంను శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూరియా, డీఏపీ తదితర ఎరువులను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే విక్రయించాలన్నారు. షాపుల ఎదుట స్టాకు నిల్వ, ధరల పట్టిక వివరాలతో కూడిన బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని వ్యాపారులను ఆదేశించారు. ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే చట్టప్రకారం కేసులు నమోదు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రైతులు అవసరం మేరకు యూరియా తీసుకోవాలని, ముందస్తుగా తీసుకుని నిల్వ చేయొద్దని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్‌కుమార్, ఏఓ యాకయ్య, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
సకాలంలో ఎరువులు అందించాలి
న్యూశాయంపేట: రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయశాఖ అధికారులతో శుక్రవారం యూరియా సరఫరాపై సమీక్షించారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు ప్రణాళికాబద్ధంగా వివిధ పంటలకు సరిపడా ఎరువులు అందించనున్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం అన్ని మండలాల్లో ‘ఏరువాక–పంటల ఆరోగ్యం’ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు. డీఆర్‌ఓ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, నర్సంపేట వ్యవసాయ సహాయ సంచాలకులు దామోదర్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
వినతులు సకాలంలో పరిష్కరించాలి
ఆర్‌టీఐ, ప్రజావాణిలో వచ్చిన వినతులను సకా లంలో పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్‌టీఐ యాక్ట్, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం కోసం శుక్రవారం సాయంత్రం అధికారులతో సమీక్షించారు. దరఖాస్తుల పరి ష్కారం పురోగతి, శాఖల వారీగా సమీక్షించి అధికా రులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు.
గురుకులాలకు పాలు, గుడ్ల సరఫరాపై సమీక్ష
జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాలకు విజయ డెయిరీ పాలు, గుడ్ల సరఫరాపై కలెక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులతో సమీక్షించారు. ఆహార పదార్థాల నాణ్యతలో ఎటువంటి రాజీపడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ సత్యశారద