
అభివృద్ధి, అవినీతిపై చర్చకు సిద్ధం
ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డికి డిప్యూటీ మేయర్ రిజ్వానా, బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల సవాల్
హన్మకొండ: అభివృద్ధి, అవినీతిపై చర్చ సిద్ధమని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు స్పష్టం చేశారు. ఎప్పుడు.. ఎక్కడికి రావాలో చెప్పాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి వారు సవాల్ విసిరారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో కలిసి గ్రేటర్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్‌రావు మాట్లాడారు. సమస్యలు, అవినీతిపై ప్రశ్నిస్తారనే భయంతో కౌన్సిల్ సమావేశంలో బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే నాయిని ఎందుకు మేయర్‌కు సూచించడం లేదని ప్రశ్నించారు. భద్రకాళి చెరువు ఎఫ్‌టీఎల్‌ను తగ్గించడానికి గుట్టల వైపు మట్టికట్ట ఎందుకు పోస్తున్నారని నిలదీశారు. ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకే ఎఫ్‌టీఎల్ తగ్గింపు అని ఆరోపించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరుడు కాంట్రాక్టర్ కావడంతోనే చెరువు పూడికతీతపై కౌన్సిల్‌లో మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. చెరువులో చనిపోయిన వ్యక్తికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. చెరువులో జరుగుతున్న అవినీతిపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ప్రశ్నిస్తే పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, సోదా కిరణ్, బోయినపల్లి రంజిత్ రావు, ఇమ్మడి లోహిత రాజు, సంకు నర్సింగరావు పాల్గొన్నారు.