
ఆటపాటల ఒడి.. అంగన్‌వాడీ
నర్సంపేట: అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు, చిన్నారుల అడ్మిషన్ల సంఖ్య ను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈనెల 12నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాలో నర్సంపేట, వరంగల్, వర్ధన్నపేట ప్రాజెక్టుల పరిధిలో 919 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతోన్నాయి.
ప్రీ ప్రైమరీ విద్య..
అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం కోసం ప్రీ ప్రైమరీ విద్యను అమలు చేయనున్నారు. ఈ మేరకు పిల్ల లకు అర్ధమయ్యేలా వినూత్న రీతిలో బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ర్యాలీలు.. సమావేశాలు..
అంగన్‌వాడీల బలోపేతంతోపాటు చిన్నారుల ప్రవేశాలకు టీచర్లు కృషి చేయనున్నారు. వారం రోజుల పాటు గ్రామాల్లో ర్యాలీలు, సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే స్వచ్ఛ అంగన్‌వాడీ, పెరటి తోటల పెంపకం, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలతో విస్తృత ప్రచారానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
కార్యక్రమాలు ఇలా..
● 12వ తేదీన గ్రామంలో ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, పోషణ్ అభియాన్ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించాలి. గ్రామస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశాలు.
● 13న గ్రామంలో రెండేళ్ల పిల్లలను గుర్తించి, అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలను తెలియజేయాలి.
● 14న స్వచ్ఛ అంగన్‌వాడీ కార్యక్రమం పేరుతో అంగన్‌వాడీ కేంద్రంలోని చెత్త, వ్యర్ధాలను తొలగించాలి. కేంద్రాల్లో మొక్కలు నాటాలి. తాగునీరు, టాయిలెట్ అందుబాటులోకి వచ్చేలా చూడాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులను ఆకట్టుకునేలా వాతావరణం ఉండేలా చూడాలి.
● 16, 17 తేదీల్లో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాలి. పిల్లలకు పాఠాలు, టైం టేబుల్, సాంస్కృతిక కార్యక్రమాలు, తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించాచలి. స్టడీ మెటిరియల్ పంపిణీ చేయాలి.
ఆట పాటల బడి... అంగన్‌వాడీ
అమ్మమాట.. అంగన్‌వాడీ బాటలో భాగంగా 3–5 సంవత్సరాల పిల్లలను కేంద్రాల్లో చేర్పించేలా అవగాహన కల్పిస్తున్నారు. కార్పొరేట్ బడులకు ధీటుగా వారి వయస్సుకు తగ్గట్టుగా సులువైన బోధన చేపడుతున్నాం. కథలు, పాటలు, ఆంగ్ల పరిచయం, భాష అభివృద్ధితో కూడిన సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తాం.
– మధురిమ, సీడీపీఓ నర్సంపేట
అడ్మిషన్ల పెంపునకు అధికారులు, సిబ్బంది ప్రణాళిక
నేటి నుంచి ఈనెల 17 వరకు
ప్రత్యేక కార్యక్రమాలు
జిల్లాలో 919 అంగన్‌వాడీ కేంద్రాలు

ఆటపాటల ఒడి.. అంగన్‌వాడీ