విత్తన విక్రయాల్లో నిబంధనలు పాటించాల్సిందే..
నెక్కొండ: విత్తనాలు, పురుగుమందుల విక్రయాల్లో వ్యాపారులు నిబంధనలు పాటించాల్సిందేనని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ అన్నారు. మండలంలోని పలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల షాపులను బుధవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేట్టారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో విక్రయానికి సిద్ధంగా ఉన్న వరి విత్తనాలు, పురుగుల మందులను పరిశీలించారు. ఈసందర్భంగా అనురాధ మాట్లాడుతూ.. విక్రయాలకు సిద్ధంగా ఉన్న విత్తన బ్యాగులపై సరైన ముద్రణ లేక, పురుగుల మందుల ప్రిన్సిపల్ లైసెన్స్ లేని కారణంగా విక్రయాలు నిలిపి వేశామని తెలిపారు. వరి విత్తన బ్యాగులపై సరైన లేబుల్ ముద్రణ లేని కారణంగా 190 బస్తాల విత్తనాలను విక్రయాలను నిలిపి వేశామన్నారు. వీటి విలువ సుమారు రూ.1,94,500 ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రిన్సిపల్ సర్టిఫికెట్ లైసెన్స్ లేకుండా విక్రయాలకు సిద్ధంగా ఉన్న రూ.1,85,600 విలువైన పురుగుల మందులను గుర్తించినట్లు తెలిపారు. వీటిని విక్రయించొద్దని ఆదేశాలు ఇచ్చామన్నారు. నిబంధలను పాటించని వారిపై శాఖ పరమైన కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ తనిఖీలో ఏఓ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
డీఏఓ అనురాధ


