ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కల్పించండి
సంగెం: ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరించి బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకు పంపించేలా ఇంటింటి వెళ్లి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు నమ్మకం కల్పించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని మొండ్రాయిలో సోమవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన విద్యార్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో నైతిక విలువతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, మధ్యాహ్నభోజనం, రాగి జావ, యూనిఫాంలు అందుతున్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉత్తమ భవిష్యత్‌కు నాంది పలకాలని సూచించారు. ఈ సందర్భంగా మొండ్రాయి ప్రభుత్వ పాఠశాలలో చదివి టెన్త్‌లో 542 మార్కులు సాధించిన అజ్మీరా దీప కు రూ.4 వేల ప్రోత్సాహకాన్ని అందజేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రమేష్, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ రవీందర్, ఎంఈఓ రాము, ప్రధానోపాద్యాయులు విజయ తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ బడిబాటలో ఎమ్మెల్యే రేవూరి


