పోషకాహార పంటలకు శ్రీకారం
హన్మకొండ: జాతీయ ఆహార భద్రతా మిషన్‌లో పోషకాహార పంటలు సాగు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు అవసరమైన పంట ఉత్పత్తులను పెంచేందుకు ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా మిషన్‌ను అమలు చేస్తోంది. 2025లో హనుమకొండ జిల్లాలో అపరాలు, పప్పు దినుసుల విస్తీర్ణాన్ని పెంచి వాటి ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది. ఈక్రమంలో జిల్లాలో రాగులు, కందులు, మినుములు సాగు చేయాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు అందాయి. ఈమేరకు జిల్లా వ్యవసాయ యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
పూర్తి రాయితీపై విత్తనాలు
ఈ మిషన్‌లో రైతులకు పూర్తి రాయితీపై విత్తనాలు అందించనున్నారు. జిల్లాలో 545 ఎకరాల్లో రాగులు సాగు చేయాలని నిర్ణయించారు. అదే విధంగా 200 ఎకరాల్లో కంది, 100 ఎకరాల్లో మినుము పంట సాగు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఏటా ఒకే రకమైన పంటలు పండించకుండా రైతులు ఇతర పంటల వైపు.. అది కూడా ప్రజలకు పోషకాలు అందించే పంటల సాగును ప్రోత్సహిస్తోంది. 645 ఎకరాల్లో రాగుల సాగుకు 25.8 క్వింటాళ్ల విత్తనాలు అవసరం. ఒక్కో ఎకరానికి 4 కిలోల విత్తనం అవసరం. రైతుకు నాలుగు కిలోల ప్యాకింగ్‌తో కూడిన విత్తన సంచిని అందించనున్నారు. 200 ఎకరాల కంది సాగుకు 8 క్వింటాళ్ల విత్తనం అవసరం. ఇది కూడా నాలుగు కిలోల విత్తనంతో కూడిన కిట్‌ను అందిస్తారు. మినుములు కూడా నాలుగు కిలోల విత్తన సంచిని అందిస్తారు. వీటి సాగుకు అర్హులైన, ఆసక్తి కలిగిన రైతులను వ్యవసాయ అధికారులు గుర్తిస్తున్నారు.
రైతులను ఎంపిక చేస్తున్నాం..
జాతీయ ఆహార భద్రతా మిషన్‌లో పంటల సాగుకు రైతుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తిగా ఒకే పంట సాగు చేయడానికి రైతు ముందుకు రాకపోతే అంతర పంటగా సాగు చేసేలా ప్రోత్సహిస్తాం. విత్తనాలు రాగానే పంపిణీ చేస్తాం.
– రవీందర్ సింగ్,
హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి
జాతీయ ఆహార భద్రతా మిషన్‌లో సాగుకు నిర్ణయం
హనుమకొండ జిల్లాలో
645 ఎకరాల్లో రాగులు
200 ఎకరాల్లో కందులు,
100 ఎకరాల్లో మినుములు
పోషకాహార పంటలకు శ్రీకారం


