
305 ఎకరాల్లో పండ్ల తోటలు
హన్మకొండ: జిల్లాలో 2025–2026 ఆర్థిక సంవత్సరానికి ఉద్యాన శాఖ ప్రణాళిక ఖరారైంది. సమీకృత అభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, నేషనల్ మిషన్ ఆజ్ ఎడిబుల్ ఆయిల్స్, జాతీయ వెదురు మిషన్ ద్వారా 305 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి జిల్లా ఉద్యాన శాఖ కార్యాచరణ రూపొందించింది. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ ద్వారా రూ.289.44 లక్షలతో పండ్ల తోటల పెంపకం, కూరగాయలు, పూల తోటల పెంపకం, మల్చింగ్, పాత తోటల పునరుద్ధరణ, నీటి కుంటలు, ప్యాక్ హౌస్‌ల నిర్మాణం, ఉద్యాన యాంత్రీకరణ, వర్మీకంపోస్టు యూనిట్ల పనులు చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా రూ.318.48 లక్షలతో సూక్ష్మ సేద్యం, తుంపర్ల సేద్యం, కూరగాయల సాగుకు శాశ్వత పందిరి నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ.265.80 లక్షలతో 700 ఎకరాల్లో బిందు సేద్యం, రూ.15.18 లక్షలతో 200 ఎకరాల్లో తుంపర సేద్యం అమలు చేయనున్నారు. రూ.37.50 లక్షలతో శాశ్వత పందిరి నిర్మాణం ద్వారా కూరగాయల సాగు చేపట్టనున్నారు. నేషనల్ మిషన్ యూజ్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం కింద నాలుగు వేల ఎకరాల్లో ఆయిల్ తోటలు పెంచనున్నారు. ఈ పథకంలో ఒక మొక్కకు రూ.193 చెల్లిస్తారు. అంతర పంటలకు ఎకరాకు 2,100 రూపాయలు 4 సంవత్సరాల పాటు చెల్లిస్తారు. జాతీయ వెదురు మిషన్ కింద రూ.90 వేలతో 1000 మొక్కలు పెంచనున్నారు. మొక్కకు రూ.150 చొప్పున అందిస్తారు. వీటిని పొలం సరిహద్దులపై పెంచనున్నారు. ఆసక్తి, నీటి వసతి కలిగిన రైతులు పంటల సాగుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సంగీతలక్ష్మి కోరారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి..
ఉద్యాన పంటలకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. ఉద్యాన శాఖ అమలు చేస్తున్న పథకాల ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. అసక్తి కలిగిన రైతులు ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతులు జత చేయాలి. వివరాలకు ఆత్మకూరు, దామెర, పరకాల, నడికూడ, శాయంపేట, కమలాపూర్ రైతులు ఉద్యాన అధికారి టి.మధుళిక (8977714069), భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హనుమకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, వేలేరు, కాజీపేట, ఐనవోలు మండల రైతులు ఉద్యాన అధికారి బి.సుస్మితాసేన్ (8977714068)ను సంప్రదించాలి.
–సంగీతలక్ష్మి, జిల్లా ఉద్యాన శాఖాధికారి
జిల్లాలో సాగు ప్రణాళిక
ఖరారు చేసిన ఉద్యాన శాఖ
సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ ద్వారా రూ.289.44 లక్షలు..
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా రూ.318.48 లక్షలతో కార్యాచరణ

305 ఎకరాల్లో పండ్ల తోటలు