వరంగల్: భూభారతి చట్టం–2025 అమలులో భాగంగా వర్ధన్నపేట మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా ఈనెల 5 నుంచి 14 వరకు మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సదస్సుల నిర్వహణ కోసం రెండు బృందాలు ఎంపిక చేసినట్లు తెలిపారు. వ్యవసాయ భూములతోపాటు గ్రామస్థాయిలో ఉండే భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అధికారులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటారని, రెవెన్యూ అధికారులతో కూడిన సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు తమ దరఖాస్తులతో హజరై సదస్సులను సద్వి నియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 5వ తేదీ బండౌతాపురం, కొత్తపల్లి, 6న ఉప్పరపల్లి, దివిటిపల్లి, 7న కట్య్రాల, ఇల్లంద, 8న ఇల్లంద, ల్యాబర్తి, 9న చెన్నారం, దమ్మన్నపేట, 12న నల్లబెల్లి, వర్ధన్నపేట, 13న నల్లబెల్లి వర్ధన్నపేట, 14వ తేదీ రామవరంలో సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు.
గణనాథుడి కల్యాణం
కాజీపేట: కాజీపేట స్వయంభూ శ్రీ శ్వేతార్కమూలగణపతి దివ్య క్షేత్రంలో కొలువుదీరిన సిద్ధి, బుద్ధి సమేత గణనాథుడికి ఆదివారం పండితులు కల్యాణ వేడుకను వైభవంగా నిర్వహించారు. వసంతోత్సవాల్లో భాగంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు అయినవోలు వెంకటేశ్వర్లు శర్మ ఆధ్వర్యాన లోక కల్యాణార్థం ఈ కల్యాణం జరిపించారు. రానున్న ఖరీఫ్ సాగు సమయంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంట లు బాగా పండాలని ఆకాంక్షిస్తూ శ్వేతార్కుడికి అభిషేకాలు, అర్చనలు చేశారు. వేడుకల్లో రాధాకృష్ణ శర్మ, సాయికృష్ణశర్మ పాల్గొన్నారు.
ముగిసిన సృజనోత్సవం
విద్యారణ్యపురి: జనవిజాన వేదిక(జేవీవీ) ఆధ్వర్యాన హనుమకొండ ప్రభుత్వ మర్కజీ హైస్కూల్‌లో ఐదురోజులుగా నిర్వహిస్తున్న వేసవి సృజనోత్సవం ఆదివారం ముగిసింది. ‘భౌతిక శాస్త్రంలో మెళకువలు’ అనే అంశంపై సుతారి రమేశ్ అవగాహన కల్పించారు. ఆర్‌పీ శాగంటి మంజుల విద్యార్థులకు డ్రాయింగ్ నైపుణ్యాలను నేర్పించారు. యోగాచార్యులు డాక్టర్ లింగమూర్తి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. బుచ్చిరాములు మ్యాజిక్ తరగతులను నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పాటలు, నృత్యం, ఉపన్యాసం, చిత్రలేఖనం, చదరంగం పోటీల్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. చివరగా శాస్త్రవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమంలో వరంగల్ నిట్ విశ్రాంత ఆచార్యులు సీవీ.రామారావు, ప్రొఫెసర్ ఆంజనేయులు, సుమలత, ఎంఈఓ బూర భిక్షపతి, ఉపాధ్యాయులు కిరణ్, లింగమూర్తి, జేవీవీ ప్రధాన కార్యదర్శి రామంచ భిక్షపతి, బాధ్యులు పరికిపండ్ల వేణు, వకుళాభరణం శ్రీనివాస్ పాల్గొన్నారు.
నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సోమవారం గ్రేటర్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మాధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ముదిరాజ్‌లకు రిజర్వేషన్లు అమలు చేయాలి
ధర్మసాగర్: రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలని ‘మెపా’ వ్యవస్థాపక అధ్యక్షుడు పులి దేవేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా అధ్యక్షుడు పులి రాజేశ్ ఆధ్వర్యాన మండల కేంద్రంలో ముదిరాజ్‌ల స్టిక్కర్ ఆవిష్కరించి మా ట్లాడారు. ప్రభుత్వం ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి ఏ లోకి మారుస్తామని కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా ఇచ్చిన హామీని మరిచిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీసీ కమిషన్ నిర్ణయం పెండింగ్‌లో ఉందని దానిపై చర్చించి ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ‘మెపా’ గౌరవ సలహాదారులు పులి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి నీరటి రాజు, సింగారపు రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నం రాజు తదితరులు పాల్గొన్నారు.