తూర్పులో ‘ఫొటో’ రాజకీయం | - | Sakshi
Sakshi News home page

తూర్పులో ‘ఫొటో’ రాజకీయం

Apr 6 2025 1:00 AM | Updated on Apr 6 2025 1:00 AM

తూర్పులో ‘ఫొటో’ రాజకీయం

తూర్పులో ‘ఫొటో’ రాజకీయం

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ తూర్పులో రాజకీయం రాజుకుంటోంది. సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీగా మారింది. సన్న బియ్యంలో కేంద్రం వాటా ఎక్కువని, రాష్ట్ర వాటా చాలా తక్కువ అంటూ.. ఎక్కువ వాటా ఇస్తున్న ప్రధాని మోదీ చిత్రపటం లేకుండా, తక్కువ వాటా ఇచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో ఎలా పెడతారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, పాలకుర్తి నియోజకవర్గాల్లో సన్న బియ్యం పంపిణీ ఈ నెల ఒకటో తేదీన ప్రారంభం కాగా.. వరంగల్‌ తూర్పులో మాత్రం శనివారం నుంచి ప్రారంభమైంది. వరంగల్‌ నగరంలోని 27వ డివిజన్‌ గోవిందరాజులగుట్ట, 32వ డివిజన్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ తోట, 37వ డివిజన్‌ తూర్పుకోటలోని కొత్తగడ్డ, 18వ డివిజన్‌ లేబర్‌ కాలనీలోని గాంధీనగర్‌ రేషన్‌ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఆయా రేషన్‌ షాపుల వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చిత్రపటాలు ఏర్పాటు చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చే ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోలు కేంద్రం నుంచే వస్తున్నాయని, ఒక కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందంటూ వరంగల్‌ బీజేపీ నాయకులు వివిధ రేషన్‌ షాపుల వద్ద శనివారం ఆందోళనకు దిగి ప్రధాని మోదీ చిత్రపటం పెట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్‌, సీనియర్‌ నేత ఎరబ్రెల్లి ప్రదీప్‌రావు, ఇతర నేతలు గిర్మాజీపేటలోని గోవిందరాజుల గుట్ట ప్రాంతంలోని ఓ రేషన్‌ దుకాణం వద్ద ప్రధాని మోదీ చిత్రపటం పట్టుకొని ఆందోళనకు దిగారు. అన్ని రేషన్‌ షాపుల వద్ద మోదీ పొటో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే బీజేపీ కార్యకర్తలే ఏర్పాటు చేస్తారని అల్టిమేటం జారీ చేయడంతో తూర్పు నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజ కీయం వేడెక్కినట్లయ్యింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ నేతల రాకతో కాస్త గొడవ జరిగినా.. ఆ తర్వాత పోలీసుల రాకతో సద్దుమణిగింది. ఓవైపు కాంగ్రెస్‌ సన్న బియ్యం క్రెడిట్‌ మాదేనని చెప్పుకుంటుంటే.. రేషన్‌ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటో ఏర్పాటు చేయాలని ఇంకోవైపు బీజేపీ డిమాండ్‌ చేస్తుండడం గమనార్హం. ఇదిలా ఉండగా మామూనూరు విమానాశ్రయం ఏర్పాటు విషయంలో క్రెడిట్‌ మాదంటే మాదని ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ పోటీపడుతున్న సంగతి తెలిసిందే.

రేషన్‌ షాపుల్లో ప్రధాని మోదీ చిత్రపటం పెట్టాలి..

నియోజకవర్గంలో

బీజేపీ నాయకుల డిమాండ్‌

కమలం వర్సెస్‌ కాంగ్రెస్‌గా మారిన

సన్న బియ్యం పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement