
అక్రమ నిర్మాణాల కూల్చివేత
వర్ధన్నపేట: ప్రభుత్వ భూమిలో అధికారులు బుధవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కట్య్రాల శివారు ఉప్పరపల్లి క్రాస్‌రోడ్డు వద్ద సర్వేనంబర్ 32లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని రెవెన్యూ పోలీసు, గ్రామ పంచాయతీ అధికారులు జేసీబీతో కూల్చివేశారు. తమ కు ఎలాంటి సమాచారం లేకుండానే అధికారులు ఇళ్లు కూల్చివేశారని బాధితులు సంగ వెంకటేశ్వర్లు, కొంగ రాజమౌళి, చేరాలు, సీనపల్లి సారయ్య, సీనపల్లి జయరాజు, దుప్పెల్లి స్వామి కన్నీటిపర్యంతమయ్యారు. అప్పు చేసి 12 సంవత్సరాల క్రితం తాటి దేవేందర్, తెంబరేణి సాంబయ్య నుంచి స్థలాలు కొనుగోలు చేశామని తెలిపారు. ఇటీవల నిర్మించుకున్న ఇళ్లను అధికారులు కూల్చివేయడంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తహసీల్దార్ విజయ్‌సాగర్‌ను వివరణ కోరగా సర్వే నంబర్ 32లో రైతువేదిక సైతం నిర్మించారని తెలిపారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించి కూల్చివేసినట్లు పేర్కొన్నారు. ఈ ఇళ్లకు అనుమతులు, విద్యుత్, నీటి వసతి లేదని చెప్పారు. కొనుగోలు సమయంలో భూమి వివరాలు, ఎవరు విక్రయిస్తున్నారో తెలుసుకోవాలని ఆయన సూచించారు.