
ఆయిల్‌పామ్ మొక్కను పరిశీలిస్తున్న జ్యోతి
దుగ్గొండి: వ్యవసాయంలో పెట్టుబడులు విపరీతంగా పెరిగి సాగు కష్టంగా మారిన తరుణంలో అన్నదాతలు ఆయిల్‌పామ్ పంటలను సాగుచేస్తే అధిక ఆదాయం అందుతుందని ఉద్యానవన అధికారిణి అల్లకొండ జ్యోతి అన్నారు. సోమవారం మండలంలోని పొనకల్, నాచినపల్లి, లక్ష్మీపురం గ్రామాల్లో ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. రెండు సంవత్సరాల వయసులో ఉన్న తోటల్లో పూల గుత్తులు వస్తాయని వాటిని వెంటనే తెంచి వేయాలన్నారు. వేసవి ఎండలనుంచి మొక్కలను రక్షించడానికి మొక్కచుట్టూ దట్టంగా జనుము ను పెంచాలని సూచించారు. నీరు సకాలంలో అందించాలని సూచించారు. మండలంలోని ఇప్పటికి 310 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు సాగు చేశారని ఇంకా తోటలు సాగు చేయాలనుకునే రైతులు పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్, ఆధార్‌కార్డుతో ఉద్యానవన అధికారిని కలవాలన్నారు. మొదటి మూడు సంవత్సరాలు ఏడాదికి రూ.4,200 సబ్సిడీ కింద అందిస్తామన్నారు. నాలుగవ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు బుస్సారి బాబురావు, గుండె రాజేందర్, వనపర్తి మల్లయ్య పాల్గొన్నారు.