మరో అవకాశం..
అర్హులైన వారిని కూడా ఈసారి ఓటరు జాబితాలో చేర్చుతారు. 18 ఏళ్ల నిండిన వారు ఎన్యుమరేషన్ ఫాం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 12 నాటికి ఓటర్లుగా నమోదైన వారికే ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయనుండగా.. జాబితాలో పేరు లేని వారికి సైతం ఓటరుగా నమోదు చేసుకోవడానికి సర్ ప్రక్రియలో అవకాశం కల్పిస్తారు. వీరికోసం బీఎల్‌ఓలు ఫారం–6తోపాటు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 మధ్య దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను ఈఆర్వోలు పరిశీలించి అర్హులకు తుది జాబితాలో చోటు కల్పిస్తారు.
అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఒక ఓటరు 2002 జాబితాలో ఉన్న ఈపీఐసీ నంబర్‌తో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లతో సర్–2026లో మ్యాపింగ్ చేస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఏకంగా 9,16,059 మంది ఓటర్లకు సంబంధించిన 2002లో ఓటరు జాబితాలో వివరాలు అందుబాటులో లేవు. దీంతో వీరంతా 2002లో ఎక్కడ ఓటర్లుగా ఉన్నారనే దానిపై అన్వేషిస్తున్నారు. ఇందుకోసం మండలాల్లో స్పెషల్ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన 2002 ఓటరు జాబితా ఈపీఐసీ నంబర్ కోసం వెతుకుతున్నారు. గతంలో 2002లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరగగా..24 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్వహిస్తున్నారు. అప్పటి జాబితాను పరిగణలోకి తీసుకుని సవరణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రస్తుతం మొత్తం 27,39,12 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 21,95,269 మంది ఓటర్లకు సంబంధించిన ఈపీఐసీ నంబర్లు 2002 ఓటరు జాబితాలోని ఈపీఐసీ నంబర్‌తో మ్యాపింగ్ పూర్తయింది. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో ఏకంగా 9,16,059 మంది పేర్లు/ తల్లిదండ్రుల పేర్లు/ బంధుత్వం/ చిరునామా ఇతర వివరాల్లో తేడాలున్నట్లు ఎన్నికల సంఘం రూపొందించిన సాఫ్ట్‌వేర్ గుర్తించింది. దీంతో 2002 నాటి వివరాలు లభించక బీఎల్‌ఓలు ఇబ్బందులు పడుతున్నారు. సర్‌లో భాగంగా జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య వారికి స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. ఆయా అనుమానాల నివృత్తికి ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల పత్రాలను ఆధారాలుగా చూపాలని కోరే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్యలో వారితోపాటు రాష్ట్రంలోని ఓటర్లందరికీ రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందిస్తారు. వాటిని నింపాక ఒక ప్రతిని వెనక్కి తీసుకోనున్నారు. స్థానిక బీఎల్‌ఓలు ఇంటింటికి తిరిగి ఈప్రక్రియ నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటన తర్వాత మ్యాపింగ్‌లో వ్యత్యాసాలున్న గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేసి నిర్దేశిత గడువులో విచారణకు హాజరు కావాలని కోరనున్నారు.
తప్పుల సవరణ..
పకడ్బందీగా ఓటరు జాబితాను తయారు చేయడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా అనర్హులను జాబితాలోంచి తొలగిస్తారు. రెండు, మూడు చోట్ల ఓటు హక్కున్న వాటిని తొలగించి.. ఒక్క చోట మాత్రమే ఉండేలా జాబితా రూపొందిస్తారు. జిల్లాలో చాలామందికి తమ సొంతూరుతోపాటు ప్రస్తుతం నివశిస్తున్న పట్టణంలోనూ ఓటు హక్కు ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాటికి చెక్ పడనుంది. అలాగే మరణించిన వారిని, ఊరు వదిలి వెళ్లిపోయిన వారి పేర్లను కూడా తొలగిస్తారు. మొత్తంగా తప్పులు లేకుండా ఓటరు జాబితా తయారు చేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టింది. ఓటరు పేరు, చిరునామా, తండ్రి/ భర్త పేరులో తప్పుగా నమోదైతే సరిదిద్దడం వంటివి కూడా చేస్తారు. ఇప్పటికే మండల స్థాయిలో ఏఎస్‌డీ (ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్) జాబితాలను రూపొందించారు. ఇందుకోసం బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటికి తిరిగి ఈ ప్రక్రియ పూర్తిచేస్తారు.
నియోజకవర్గం 2025లో ఓటరు మ్యాప్ చేయని తప్పులు/అక్రమాలు
మొత్తం ఓటర్లు మ్యాపింగ్ ఓటర్లు ఉన్న ఓటర్లు
నాగర్‌కర్నూల్ 2,40,571 1,83,129 57,442 72,073
అచ్చంపేట 2,48,362 2,04,770 43,592 86,532
కొల్లాపూర్ 2,42,699 1,91,733 50,966 79,901
కల్వకుర్తి 2,45,355 1,89,868 55,487 66,347
వనపర్తి 2,75,570 2,25,653 49,917 97,926
గద్వాల 2,61,810 1,98,304 63,506 79,677
అలంపూర్ 2,42,049 2,02,489 39,560 75,982
మహబూబ్‌నగర్ 2,64,235 1,80,078 84,157 84,090
జడ్చర్ల 2,25,911 1,83,253 42,658 72,068
దేవరకద్ర 2,42,342 2,02,135 40,207 80,533
నారాయణపేట 2,42,773 2,04,230 38,543 87,396
మక్తల్ 2,52,801 2,19,495 33,306 99,881
కొడంగల్ 2,51,255 2,00,361 50,894 79,299
అభ్యంతరాలు వస్తే పరిశీలిస్తాం..
అర్హులందరికీ ఓటుహక్కు కల్పించడమే ఎస్‌ఐఆర్ ప్రధాన ఉద్దేశం. డ్రాఫ్ట్ ఓటరు జాబితాను జూలై 31న విడుదల చేస్తాం. 2026, అక్టోబర్ 1 నాటికి అర్హత తేదీగా నిర్ణయించి.. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరణించి వారు, ఇతర ప్రాంతాలకు మారినవారు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు ఉంటుంది. 2002 నాటి ఎస్‌ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నాం. ప్రస్తుత ఓటరు పేరు పాత జాబితాలో లేకపోతే వారి తల్లిదండ్రులు లేదా తాతముత్తాల పేర్లు, ఈపిక్ నంబరు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి.. కొత్త ఓటర్ల నుంచి నమోదు ఫారాలు స్వీకరిస్తారు. – హేమంత కేశవ్ పాటిట్, కలెక్టర్
2002 జాబితా ఈపీఐసీ
నంబర్లతో ప్రస్తుత ఓటర్ల మ్యాపింగ్
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 80.15 శాతం పూర్తయిన ప్రక్రియ
9,16,059 మంది అనమానాస్పద ఓటర్ల వివరాల కోసం ఆరా
ఎస్‌ఐఆర్–26లో నోటీసులు
జారీ చేసి ఆధారాలు చూపాలని కోరే అవకాశం
అప్పటి ఈపీఐసీ నంబర్లు లభించక బీఎల్‌ఓల ఇక్కట్లు
ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఓటరు మ్యాపింగ్ ఇలా..
అక్షర దోషాలున్నా..
సర్ నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించింది. ఓటర్ల వివరాల్లో ఎలాంటి తేడాలున్నా పట్టేసి అనుమానాస్పద జాబితాలో చేరుస్తోంది. 2002 జాబితాకు ఇప్పటి జాబితాకు పేర్ల అక్షరాల్లో మార్పులు, బంధుత్వం పొరపాటుగా నమోదై ఉండటం (ఉదాహరణ తండ్రికి బదులు భర్త) తండ్రికి బిడ్డకు మధ్య వయసులో అసాధారణ తేడాలుండటం, ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ మంది సంతానం ఉండటం, క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు తప్పుడు మ్యాపింగ్ చేయడం వంటి లోపాలను సాఫ్ట్‌వేర్ గుర్తిస్తోందని అధికారులు తెలిపారు. ఇలాంటి కారణాలతోనే ఉమ్మడి జిల్లాలో 9,16,059 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్నారు.


