జిల్లాలో ప్రారంభమైన వన మహోత్సవం
అమరచింత: జిల్లాలో ఈ ఏడాది వన మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటికే పలు గ్రామాల్లో వర్షాల అదును చూసి మొక్కలు నాటుతుండగా.. మరికొన్ని గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా కూలీలతో గుంతలు తవ్వించే పనుల్లో నిమగ్నమయ్యారు. గ్రామాలకు కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, ప్రార్థన మందిరాలు, దేవాలయాల వద్ద ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాల్లో గుంతలు తవ్వి సిద్ధం చేస్తున్నారు. ఎనిమిది విడతల్లో నాటిన మొక్కలతో పాటు ఈసారి కొత్తగా ప్రధాన రహదారులకు ఇరువైపులా మూడు వరుసల్లో నాటేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది వన మహోత్సవం లక్ష్యాన్ని 20.55 లక్షలుగా ఉన్నతాధికారులు విధించారు.
మండలం గ్రామాలు లక్ష్యం
పాన్‌గల్ 28 2,93,000
ఖిల్లాఘనపురం 27 2,82,600
వనపర్తి 26 2,55,000
కొత్తకోట 22 2,26,400
పెద్దమందడి 22 2,30,690
పెబ్బేరు 20 2,20,000
మదనాపురం 17 1,74400
చిన్నంబావి 17 1,73,400
గోపాల్‌పేట 15 1,58,200
అమరచింత 14 1,45000
వీపనగండ్ల 14 1,42,200
ఆత్మకూర్ 13 1,34000
రేవల్లి 12 1,24600
శ్రీరంగాపురం 8 82,400
గుంతలు తవ్విస్తున్నాం..
వన మహోత్సవంలో భాగంగా వానాకాలంలో మొక్కలు నాటేందుకు గ్రామాల్లో ఉపాధి కూలీల ద్వారా ఇప్పటి నుంచే గుంతలు తవ్విస్తున్నాం. మండలానికి ఇచ్చిన లక్ష్యం పూర్తి చేయడానికి గ్రామాల్లోని క్షేత్ర సహాయకులతో పాటు పంచాయతీ కార్యదర్శుల సహకారం తీసుకుంటున్నాం. వానాకాలం ప్రారంభం కాగానే అనుకున్న విధంగా మొక్కల నాటే కార్యక్రమం పూర్తి చేస్తాం.
– బాలయ్య, ఏపీఓ, మదనాపురం
లక్ష్యాన్ని చేరుకుంటాం..
వన మహోత్సవంలో భాగంగా జిల్లాకు ఇచ్చిన లక్ష్యం మేర మొక్కలు నాటేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. జిల్లాలోని 14 మండలాల్లో ఇప్పటి నుంచే గుంతలు తవ్వి సిద్ధం చేస్తున్నాం. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాం. వాడిపోతున్న మొక్కల స్థానంలో కొత్త వాటిని నాటుతాం. – ఉమాదేవి, డీఆర్డీఓ
మండలాల వారీగా లక్ష్యం ఇలా..
పచ్చదనం పెంపొందించేందుకే..
ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరిసేలా జిల్లా యంత్రాంగం చొరవ చూపుతోంది. గ్రామపంచాయతీలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు అక్కడే ఏర్పాటు చేసిన వన నర్సరీల నుంచి మొక్కలు తీసుకొని ఎప్పుడుపడితే అప్పుడు విరివిగా నాటుకునే విధంగా చర్యలు చేపట్టింది. గతంలో నాటిన మొక్కలు వాడిపోవడం, ఎండిపోవడం వంటివి జరిగితే అప్పటికప్పుడే తొలగించి ఆ ప్రదేశంలో కొత్త మొక్కలు నాటనున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 10 వేల మొక్కల సామర్థ్యం గల వన నర్సరీని ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి అప్పగించడంతో ఈసారి మొక్కలను ఇతర ప్రాంతాల నుంచి రవాణా చేసుకొనే పరిస్థితి లేదు.
ఈ ఏడాది జిల్లా లక్ష్యం 20.55 లక్షలు
గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో
గుంతల తవ్వకాలు
వర్షాకాలం సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక


