బాధితుల్లో భరోసా పెంచేలా సేవలు | - | Sakshi
Sakshi News home page

బాధితుల్లో భరోసా పెంచేలా సేవలు

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

కొత్తకోట రూరల్‌: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడు పోలీసులు తనకు అండగా ఉన్నారనే నమ్మకంతో తిరిగి వెళ్లాలని.. బాధితులకు న్యాయం చేయడం, ప్రజలకు భద్రత కల్పించడం, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ప్రతి పోలీసు అధికారి ప్రధాన బాధ్యతని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం పెద్దమందడి పోలీస్‌స్టేషన్‌ను ఆమె సందర్శించారు. ముందుగా పోలీసు అధికారులు ఆమెకు పూలమొక్క అందజేసి స్వాగతం పలకగా.. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. స్టేషన్‌ ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో వాహనాల పార్కింగ్‌ ప్రదేశం, రిసెప్షన్‌, స్టేషన్‌ రైటర్‌, టెక్‌ టీమ్‌, ఎస్‌హెచ్‌ఓ, మెన్‌ రెస్ట్‌రూమ్‌, లాకప్‌ రూమ్‌ను తనిఖీ చేసి పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్‌ పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి.. పెండింగ్‌ కేసులు, దర్యాప్తు వివరాలను ఎస్‌ఐ జలంధర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. గంజాయి, మట్కా, పేకాటలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. సాయంత్రం వేళల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సిబ్బంది విధులు, పని తీరు, సమస్యలు అడిగి తెలుసుకొని ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. గ్రామ పోలీస్‌ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, గ్రామ పెద్దలు, యువతతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతిభద్రతలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు. స్టేషన్‌ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్‌ హిస్టరీ షీటర్ల వివరాలు పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సూచించారు. స్టేషన్‌ రికార్డులైన పార్ట్‌–1 నుంచి పార్ట్‌–5 వరకు పెండింగ్‌ లేకుండా సీసీటీఎన్‌ఎస్‌–2.0లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా గుర్తించి సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని.. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, సిబ్బంది ప్రతి ఒక్కరూ అన్నిరకాల విధులపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే పోలీస్‌శాఖకు మంచి పేరు వస్తుందన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ గిరిబాబు, కొత్తకోట సీఐ రాంబాబు, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement