వనపర్తి: ప్రకృతి సమతుల్యతకు చెట్లు ఎంతో ముఖ్యమని.. బాగా వర్షాలు కురవాలంటే విస్తృతంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎకో పార్క్‌లో అటవీశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించగా.. ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరై పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని గుర్రంగూడలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారని, అదే స్ఫూర్తితో జిల్లాకేంద్రంలోని ఎకో పార్క్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం సుమారు 24 శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉందని.. 33 శాతానికి పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించామని, ముఖ్యఅతిథులతో పాటు విద్యార్థులు తమ పేర్లపై మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని బాధ్యతగా తీసుకోవాలని కోరారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని.. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్య, కౌన్సిలర్ మహేశ్వరి, అటవీశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


