అభిప్రాయ సేకరణకే చర్చల కమిటీ సమావేశం | - | Sakshi
Sakshi News home page

అభిప్రాయ సేకరణకే చర్చల కమిటీ సమావేశం

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

వనపర్తి: గణప సముద్రం రిజర్వాయర్‌ భూ సేకరణకు సంబంధించి రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికే జిల్లాస్థాయి చర్చల కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని.. విన్నపాలను ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయి చర్చల కమిటీ సమావేశం జరగగా.. రిజర్వాయర్‌ పరిధిలోని 164 ఎకరాల భూముల రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముందుగా రైతులు భూ సేకరణ అంశానికి సంబంధించి తమ అభిప్రాయాలను అధికారులకు వెల్లడించారు. తామంతా కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నామని.. భూములు కోల్పోతే ఉపాధి లేక రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పంటలు పండక వలసలు వెళ్లిన పరిస్థితులు ఉండేవని.. ఇప్పుడు నీటి సౌకర్యం ఏర్పడి పంటలు బాగా పండుతున్నాయని, ఈ సమయంలో భూ సేకరణ పేరుతో తమకు అన్యాయం చేయవద్దని కోరారు. ప్రభుత్వం ఎకరానికి నిర్దేశించిన విధంగా రూ.12.50 లక్షలు కాకుండా పెద్ద మొత్తంలో నష్ట పరిహారం ఇవ్వాలని విన్నవించారు. పరిహారం విషయంలో ప్రభుత్వం భూములపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి న్యాయమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో మార్కెట్‌ ధరలకు అనుగుణంగా పరిహారం నిర్ణయిస్తుందని, రైతులు ఎవరూ కంగారు పడొద్దని, న్యాయం చేసేందుకే ప్రభుత్వం తరఫున తాము ఎప్పుడు ప్రయత్నిస్తామన్నారు. సాటిల్‌ బండ్‌ విషయంలో సీఈల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తామని చెప్పారు. భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఎంత ఇవ్వొచ్చు అనేది త్వరలోనే నిర్ణయిస్తామని.. అధికారులు గ్రామానికి వచ్చి తెలియజేస్తారని వివరించారు. రైతుల విన్నపాలను ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేస్తామన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ తిరుపతయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, నాయకులు సాయిచరణ్‌రెడ్డి, సర్పంచి, నీటిపారుదలశాఖ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌, డివిజనల్‌ ఇంజినీర్‌, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement