ఆ మాట వింటే.. ఫీజులు ఎగరాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

ఆ మాట వింటే.. ఫీజులు ఎగరాల్సిందే!

Jun 18 2026 8:04 AM | Updated on Jun 18 2026 8:04 AM

ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లు

ఎల్‌కేజీ, యూకేజీ, 1వ తరగతికి రూ.35 వేల నుంచి 50 వేల వరకు..

స్కూల్‌స్థాయిలో ఐఐటీ, నీట్‌

ఫౌండేషన్‌ కోర్సుల పేరిట అదనం

టై, బెల్టు, పుస్తకాలు, యూనిఫాం, బూట్ల పేరుతో నిలువు దోపిడీ

పాఠశాలల్లోనే విక్రయిస్తున్నాపట్టింపులేని విద్యాధికారులు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: సామాజిక సేవతో నిర్వహించాల్సిన ప్రైవేటు పాఠశాలలు కొందరు వ్యాపారంగా మార్చడంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులకు గుదిబండగా మారింది. ఉమ్మడి జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలల్లో.. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా.. విద్యాశాఖ అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలో పెద్దఎత్తున ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు ప్రారంభం కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఫీజులు, ఇతర ఖర్చులు అమాంతం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఒకపక్క ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తుందన్న చర్చ జరుగుతుంది. మరోవైపు అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకో వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఐఐటీ, నీట్‌కు అదనం..

పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలలోని అంశాలు కాకుండా సంబంధం లేని ఐఐటీ, నీట్‌ బోధిస్తామని.. రూ.10–20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో స్టడీ మెటీరియల్‌కు అదనపు ఫీజులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఐఐటీ, నీట్‌ బోధించేందుకు వారంలో రెండు, మూడు రోజులు ఉదయం, లేదా సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పీఈటీ తరగతులను ఎత్తివేసి వాటికి సమయం కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా..

ఫీజుల విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యాధికారులు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసిన ప్రతిసారి కంటితుడుపు చర్యలు తీసుకొని వదిలేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిద్రమత్తు వీడి ప్రైవేటు పాఠశాల అక్రమ వసూళ్లున అడ్డుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. – ప్రశాంత్‌,

ఎస్‌ఎఫ్‌ఐ, సంఘం రాష్ట్ర నాయకుడు

నిబంధనలకు విరుద్ధం..

ప్రభుత్వ అనుమతి లేకుండా నారాయణ పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తుంటే వాటిని పట్టుకున్నాం. ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనిపై డీఈఓకు ఫిర్యాదు చేశాం. ఎంఈఓకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తే నాకు మీటింగ్‌ ఉందని చెప్పి రాలేదు. ఆ తర్వాత మళ్లీ ఫోన్‌ చేస్తే ఎత్తలేదు. అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలలను తనిఖీ చేయాలి.

– శివసాగర్‌, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు

చర్యలు తీసుకుంటాం..

ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో ఎలాంటి స్టేషనరీ, యూనిఫాంలు అమ్మకూడదు. వీటితోపాటు పుస్తకాలను కేవలం ఎమ్మార్పీకే అమ్మాలి. అలాగే పాఠశాల సమయంలో సిలబస్‌ మాత్రమే బోధించాలి. ఐఐటీ, నీట్‌ వంటివి చెప్పడానికి వీల్లేదు. – విజయకుమారి,

డీఈఓ, మహబూబ్‌నగర్‌

కొన్ని ప్రైవేట్‌ స్కూల్స్‌లో దోపిడీ ఇలా..

● మహబూబ్‌నగర్‌తెలంగాణ చౌరస్తా సమీపంలో ఉన్న ఓ పాఠశాలలో ఎల్‌కేజీ, యూకేజీ, 1వ తరగతి విద్యార్థులకు రూ.35– 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీటితోపాటు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, అక్కడే కొనాలి. దీంతో ఒక్కొక్కరిపై కనీసం రూ.8 వేల వరకు అదనపు భారం పడుతుంది. నగరంలోని ఏనుగొండ సమీపంలో ఇటీవల ప్రారంభించిన ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో జిల్లాలోనే అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. 6, 7 తరగతి విద్యార్థులకే రూ.70–95 వేల వరకు వసూలు చేస్తున్నారని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీటికి తోడు యూనిఫాం, పుస్తకాలు అదనం.

● వనపర్తి జిల్లాకేంద్రంలోని చిట్యాల రోడ్డులో గల ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో నర్సరీకే రూ.45వేలు వసూలు చేస్తున్నారు. బుక్స్‌, యూనిఫామ్స్‌ కూడా అక్కడే కొనాలి. ఏడో తరగతికి రూ.90 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 150 ప్రైవేట్‌ స్కూల్స్‌ ఉన్నా.. ఒక్కరూ కూడా ఫీజుల వివరాలు డిస్‌ప్లే చేయడం లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement