వనపర్తి: ప్రజలకు న్యాయం అందించడంలో పోలీసుశాఖ కీలక పాత్ర పోషిస్తుందని.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి అండగా ఉన్నారనే నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రతి పోలీసు అధికారిపై ఉందని హైదరాబాద్ మల్టీ జోన్–2 ఐజీ షానవాజ్ ఖాసీం అన్నారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని సత్వర పరిష్కార చర్యలు చేపడుతూ మర్యాదపూర్వకంగా, మానవీయ దక్పథంతో వ్యవహరించడంతో పోలీసు, ప్రజా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఆయనతో పాటు జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ తనిఖీ చేసి జిల్లా పోలీసు పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎస్పీ సునీతారెడ్డి వారికి పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో నమోదైన యూఐ, గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, కాంటెస్టెడ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు 60 రోజుల్లో పూర్తిచేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసుకు స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, రౌడీషీటర్లు, కేడీలు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. రోజు ఉదయం, సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టాలని, రాత్రి గస్తీని మరింత పటిష్టం చేయాలని పేర్కొన్నారు. పోలీసు అధికారులు, వీఆర్వోలు, బీట్ అధికారులు క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శిస్తూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు. రికార్డులను నిరంతరం నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా ప్రతి కేసు వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో సకాలంలో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రికార్డుల నిర్వహణలో 5ఎస్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీ చేపడుతున్న చర్యలపై ఐజీ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి ఆవరణలో మొక్కలు నాటారు. గతంలో ఏఎస్పీగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలోఅదనపు ఎస్పీ రాజేష్ మీనా, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ గిరిబాబు, జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ సునంద, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీఐలు సుగంధ రత్నం, రాంబాబు, శివకుమార్, సీసీఎస్ సీఐ అశోక్‌కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ మల్టీ జోన్–2 ఐజీ షానవాజ్ ఖాసీం


