ధాన్యం తరలింపులో జాప్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తరలింపులో జాప్యం వద్దు

Jun 18 2026 8:04 AM | Updated on Jun 18 2026 8:04 AM

వనపర్తి రూరల్‌: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వరి ధాన్యం తేమ శాతం పరిశీలించి త్వరగా తూకం చేసి కేటాయించిన మిల్లులకు లారీల్లో తరలించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సూచించారు. మంగళవారం శ్రీరంగాపురం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం లక్ష్మీవారాహి రైస్‌మిల్లును తనిఖీ చేసి నిర్వాహకులతో మాట్లాడారు. ధాన్యం లారీలు ఎక్కువ సమయం వేచి ఉండకుండా వేగంగా అన్‌లోడ్‌ చేయాలని, కోతలు విధించవద్దని స్పష్టం చేశారు. ట్రక్‌ షీట్లను వెంటనే వాట్సాప్‌లో పీసీసీ ఇన్‌చార్జ్‌లకు పంపించాలని మిల్లర్లను ఆదేశించారు. దీంతో ట్యాబ్‌ఎంట్రీలు త్వరగా పూర్తయి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. తహసీల్దార్‌ వరలక్ష్మి ఉన్నారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పనిసరి

వనపర్తి రూరల్‌: గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు నాణ్యతగా గడువులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ అన్నారు. మంగళవారం మండలంలోని నాగమ్మతండాలో గ్రామపంచాయతీ కార్యాలయం, మహిళా సమాఖ్య భవన నిర్మాణాలతో పాటు వన నర్సరీని ఆయన పరిశీలించారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని పీఆర్‌ ఏఈ భాస్కర్‌కు సూచించారు. నర్సరీ నిర్వహణను మరింత మెరుగుపర్చాలని, మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్యదర్శిని ఆదేశించారు. వర్యావరణ పరిరక్షణలో నర్సరీల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఆయన వెంట డీపీఓ రఘునాథ్‌రెడ్డి ,ఎంపీడీఓ ఎండీ అజార్‌ మొహినోద్దీన్‌, ఎంపీఓ రాజవర్ధన్‌రెడ్డి, కార్యదర్శి వెంకటస్వామి పాల్గొన్నారు.

భూసార పరీక్షలతో అధిక దిగుబడులు

అమరచింత: భూసార పరీక్షలతో అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందని మదనాపురం కృషి విజ్జాన కేంద్రం శాస్త్రవేత్తలు డా. అనిత, డా. భవాని అన్నారు. మంగళవారం మండలంలోని ఈర్లదిన్నెలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు వారు హాజరై మాట్లాడారు. పచ్చిరొట్ట పెంపకం, జీవన ఎరువుల వినియోగంతో రసాయన ఎరువులను నియంత్రించుకునే అవకాశం ఉందన్నారు. వానాకాలంలో రైతులు వరితో పాటు పత్తి అధికంగా సాగు చేస్తుంటారని.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏఈఓలతో తెలుసుకోవాలని సూచించారు. అనంతరం మహిళలను ఉద్దేశించి పౌష్టికాహారం, కుటుంబ పోషణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏఓ అరవింద్‌, సర్పంచ్‌ చుక్క వెంకటమ్మ, మండల సమాఖ్య అధ్యక్షురాలు వెంకటమ్మ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement