భూ నిర్వాసితులకు ఒకేసారి అవార్డు చేయండి | - | Sakshi
Sakshi News home page

భూ నిర్వాసితులకు ఒకేసారి అవార్డు చేయండి

Jun 18 2026 8:04 AM | Updated on Jun 18 2026 8:04 AM

ఖిల్లాఘనపురం: గణప సముద్రం రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న తమకు ఒకేసారి అవార్డు చేయాలని భూ నిర్వాసితులు భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ తిరుపతయ్యకు విన్నవించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేధికలో గణపసముద్రం భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు ఆర్డీఓ సుబ్రమణ్యం హాజరై రైతుల అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వారి సమస్యలు, ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రిజర్వాయర్‌లో 647 ఎకరాల భూమి ముంపునకు గురవుతోందని.. ఇప్పటి వరకు మొదట 18 ఎకరాలు, ఇటీవల 388 ఎకరాలకు అవార్డు చేసి 10 రోజుల్లో పరిహారం ఇస్తామని చెప్పి ఏడాది తర్వాత చెల్లించారని.. అదికూడా నిరసనలు, ఖిల్లాఘనపురం బంద్‌ చేపట్టిన తర్వాత ఇచ్చారన్నారు. ప్రస్తుతం మరో 163 ఎకరాలకు అవార్డు చేసుకోవాలని నోటీసులు ఇచ్చారని.. ఇంకా అంతాయపల్లి శివారుకు చెందిన 55 ఎకరాలు, వెంకటాంపల్లికి చెందిన 19 ఎకరాలు, మహ్మద్‌హుస్సేన్‌పల్లికి చెందిన 4 ఎకరాలు మిగిలిందని తెలిపారు. మిగిలిన 241 ఎకరాలకు ఒకేసారి అవార్డు చేసి వెంటనే పరిహారం డబ్బులు వేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. గణపసముద్రం చెరువు పూర్తిస్థాయిలో నిండితే గ్రామానికి ఆనుకుని ఉన్న రోడ్డుకు చేరేవని.. ఇప్పుడు అలుగు ఎత్తు 3 ఫీట్లు పెంచితే గ్రామంలోకి నీళ్లు వస్తాయని, పెంచకుండా చూడాలని కోరారు. రిజర్వాయర్‌ నిండిన సమయంలో గ్రామంలోకి నీళ్లు రాకుండా చివరిలో బండు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అలుగు ఎత్త పెంచి గ్రామం నుంచి తరలించాలని చూస్తే ఊరుకునేది లేదని కొందరు రైతులు హెచ్చరించారు. భూములు కోల్పోయిన రైతులకు రిజర్వాయర్‌ వెనక ఉన్న ఏడు కోట్లలోని భూమిని ఒక్కొక్కరికి కనీసం మూడు గుంటలు పట్టా చేయాలని, కనీసం 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. అనంతరం భూసేకరణ డిప్యూటీ కలెక్టర్‌ మాట్లాడుతూ.. రైతులు చెప్పిన విషయాలు, సందేహాలు నమోదు చేసుకున్నామని.. ఈ నెల 18న కలెక్టరేట్‌లో రైతులతో కలెక్టర్‌ ప్రత్యేకంగా సమావేశమవుతారని చెప్పారు. వీటితో పాటు ఇంకా ఏమైన సమస్యలుంటే వివరించాలని కోరారు. సమావేశంలో ఐబీ డీఈ బాబుచంద్‌, తహసీల్దార్‌ సుగుణ, సర్పంచ్‌ పద్మమ్మ, వివిధ శాఖల ఏఈలు, అధికారులు పాల్గొన్నారు.

స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌కు మొరపెట్టుకున్న రైతులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement